Tuesday, November 19, 2024

విష సర్పాలతో జాగ్రత్త.. గ్రామీణులకు పొంచి ఉన్న ప్రమాదం..

ఘట్‌కేసర్‌, ప్రభన్యూస్ : ప్రస్తుతవేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు విషసర్పాలతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో పాములు దరిచేరి కాటేస్తుండటం జరుగుతుంటాయి. వేసవిలో అకాల వర్షాలకు రాత్రి వేళల్లో పాముల సంచారం అధికంగా ఉంటుంది. పాముల్లోని విషం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి రక్తనాడులపై ప్రభావం చూపేదికాగా, మరొకటి నరాలపై ప్రభావం చూపుతుంది. వేసవి కాలంలో మనుషులకు పాముకాటు వల్ల ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లోఆరుబయట నిద్రించడం ఒక కారణమైతే అకాల వర్షాలకు రాత్రివేళల్లో చల్లదనం ఏర్పడి పాములు బయటికి రావడంతో మానవునికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇళ్లల్లోకి ప్రవేశించిన పాములు చల్లటి ప్రదేశాల్లో మాటువేసి కాటువేసే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రమాదవశాత్తు పాముకాటు వేసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వైద్యులు కొన్ని సలహాలు, ఇస్తున్నారు. ముఖ్యంగా విషరహిత పాములే అధికంగా ఉంటాయని చెబుతున్నారు. కాటుకు గురైన వ్యక్తిని నెమ్మదిగా పడుకోబెట్టాలి. ఎక్కువగాగాబర పెట్టడం వల్ల విషం త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాటుకు గురైన వ్యక్తికి 70 శాతం పాములు విషం రహిత మైనవేనని తెలపాలి. 30 శాతంలో సగం మాత్రమే మనిషి శరీరంలోకి విషాన్ని పంపే పాములు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. చేయి లేదా కాలిపై పాముకాటు వేటువేసినప్పుడు సాధ్యమైనంత వరకు అవయవాలను కదిలించకుండా జాగ్రత్త పడాలి, చిన్నగుడ్డతో ఒత్తిడి అధికంగా లేకుండా కట్టుకట్టాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం వృధా చేయరాదు. ఆసుపత్రులలో చేరిన అనంతరం ప్రయాణ సమయంలో బాధితుడు ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని వైద్యులకు తెలపాలి.

కాటేసిన పామును గుర్తించివైద్యులకు తెలపడం వల్ల సరైన మందులు అందజేసి ప్రాణాపాయం నుంచి తప్పించగలుగుతారు. పాము కాటేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటువైద్యం జోలికి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా మెలగడం ఎంతైనా మంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement