ఇండియన్ రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ యాప్‌లో నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు వినియోగిస్తున్నారు. రైలు, విమాన టికెట్లతో పాటు, హోటల్ రూమ్‌ల బుకింగ్ వరకు ఇందులో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా ఆయా సేవలు ఉపయోగించుకునే వారు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లిస్తుంటారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను ఈ యాప్‌పై పడింది. ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఉపయోగించే వారిని లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ స్కామ్ పేరుతో కొత్త తరహా మోసాలకు ఈ కేటుగాళ్లు తెరలేపారు. ఈనిపై భారత రైల్వే శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
మోసగాళ్లు పెద్ద ఎత్తున ఐఆర్‌సీటీసీ పేరుతో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఈ లింక్ సహాయంతో ఫేక్ ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. ఇలాంటి మోసాల భారీన పడవద్దని ఐఆర్‌సీటీసీ హెచ్చరించింది. అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారానే టికెట్‌లు బుక్ చేసుకోవాలని కోరింది. యూజర్లు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి మాత్రమే ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. మెసేజ్‌లు, ఇతర మార్గాల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని కోరింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకే సైబర్ నేరగాళ్లు ఇలా లింక్‌లు పంపిస్తున్నారని తెలిపింది.