Friday, November 22, 2024

నాటోలో చేరారో జాగ్రత్త, సైనికచర్య అనివార్యం కావొచ్చు.. ఫిన్లాండ్‌కు రష్యా హెచ్చరిక

నాటో కూటమిలో సభ్యతంకోసం అతి త్వరలో దరఖాస్తు చేస్తామన్న ఫిన్లాండ్‌ ప్రకటనపై రష్యా కారాలు మిరియాలు నూరుతోంది. రష్యాకు ముప్పు కలిగించే నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. సైనిక-సాంకేతికపరమైన చర్యలు అనివార్యం కావొచ్చని స్పష్టం చేసింది. ఫిన్లాండ్‌ నిర్ణయం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఉత్తర ఐరోపా భద్రతకు ముప్పు తప్పదని బెదరించింది. రష్యాతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాలను ఫిన్లాండ్‌ ఉల్లంఘించినట్టే భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ విస్పష్ట ప్రకటన విడుదల చేసింది.కాగా ఫిన్లాండ్‌ నిర్ణయం వల్ల రష్యాకు ఎదురయ్యే ముప్పు, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్య తీసుకునేందుకైనా వెనుకాడబోమని రష్యా హెచ్చరించింది. నాటోలో చేరేముందు ఎదురయ్యే పరిణామాలను ఫిన్లాండ్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు చెప్పింది. మరోవైపు ఫిన్లాండ్‌, సీడన్‌ నాటోలో చేరే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దృష్టి సారించారు. జాతీయ భద్రతామండలితో శుక్రవారం భేటీ అయిన పుతిన్‌ ఆ దేశాలు నాటోలో చేరితే ఎదురయ్యే పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. కాగా నాటో విస్తరణపై సభ్య దేశాలు ఏకగ్రీవ నిర్ణయంతోనే జరగాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ అభిప్రాయపడ్డారు. ఫిన్‌లాండ్‌, స్వీడన్‌ నాటోలో చేరబోతాయన్న అంశంపై ఆయన శుక్రవారం ఇస్తాంబుల్‌లో స్పందించారు. నార్డిక్‌ దేశాలు ఎన్నో ఉగ్రసంస్థలకు ఆశ్రయం ఇస్తున్నాయని, అలాంటి దేశాలకు సభ్యత్వం ఇచ్చే అంశంపై విస్తృత చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement