Wednesday, November 6, 2024

Donald Trump | అమెరికాకు ఇక మంచి రోజులు..

  • వ‌ల‌స‌లు నివారించేందుకు స‌రిహ‌ద్దులు మూసివేస్తాం
  • నిపుణులైన వారికే ఆమెరికాలో ప్ర‌వేశం
  • ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ముందుకు సాగుతాం
  • త‌న విజ‌యంలో ఎల‌న్ మ‌స్క్ దే కీల‌క పాత్ర‌
  • ఇంత‌టి అద్భుత విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు థ్యాంక్స్
  • ప్ర‌జాసేవ కోస‌మే హ‌త్యాయ‌త్నం నుంచి దేవుడు ప్రాణాలు కాపాడాడు
  • ఫ్లొరిడాలోని తన పామ్ బీచ్ లో ప్రసంగించిన కాబోయే అధ్యక్షుడు


ఫ్లొరిడా – అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. మెజార్టీ ఎల‌క్ట్రోర‌ల్ ఓట్లు సాధించిన అనంత‌రం ఫ్లొరిడాలోని తన పామ్ బీచ్ లో ప్రసంగించిన కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్ర‌సంగం చేశారు..

‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ తనకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పారు. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని, తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 270 దాటి 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించి 47వ అధ్య‌క్షుడిగా ఎన్నికైన తనకు మొత్తం 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని చెప్పారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు ఇంతటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు అద్భుతంగా పోరాడారని, అదే పోరాట పటిమతో దేశాన్ని మరోమారు అద్భుతంగా తీర్చిదిద్దుకుందామంటూ తన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

- Advertisement -

ప్ర‌జా సేవ‌కే ఆ దేవుడు కాపాడాడు…
ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటననూ ట్రంప్ ప్రస్తావించారు. ‘అమెరికాకు, అమెరికన్లకు సేవ చేయడానికే దేవుడు నా ప్రాణాలు కాపాడాడని చాలామంది నాతో చెప్పారు. ఆ రోజు జరిగిన హత్యాయత్నం నుంచి తనను ప్రాణాలతో బయటపడేయడం వెనకున్న కారణం ఇదే. దేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందనే కాపాడాడు. ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే సమయం వచ్చింది. దేశానికి సేవ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు, నేను, మనమంతా కలిసి అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దుకుందాం’ అంటూ ట్రంప్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటూ చెప్పారు. ‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి జేడీ వాన్స్‌, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్‌ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్‌ గుర్తు చేశారు. ట్రంప్‌ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్‌ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్‌ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement