Saturday, November 23, 2024

ఫంక్షనల్ వర్టికల్స్ లో ఉత్తమ ఫలితాలు.. 256 పోలీసు అధికారులకు పురస్కారాలు (ఫొటోలు)

రాష్ట్రంలోని పోలీస్ శాఖలో పోలీసు అధికారుల వృత్తి పరమైన పని సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ విధానం వల్ల కేసుల దర్యాప్తులో మెరుగైన ఫలితాలు రావడంతోపాటు నేరస్తులకు సకాలంలో శిక్ష పడి అతి తక్కువ సమయంలోనే కేసుల దర్యాప్తు పూర్తవుతున్నాయని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ స్థాయిలో విధుల నిర్వహణలో ఫంక్షనల్ వర్టికల్స్ ప్రాతిపదికన ఉత్తమ ప్రతిభ కనపరచిన 256 మంది పోలీస్ అధికారులకు డీజీపీ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. డీజీపీ కార్యాలయంలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) జరిగిన కార్యక్రమానికి అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, స్వాతి లక్రా, నాగిరెడ్డి, సంజయ్ జైన్, విజయ్ కుమార్, ఐ.జి కమల హాసన్ రెడ్డి, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల వారీగా పోలీసుల పనితీరుని తెలిపే సత్వర స్పందన, నేరాల నిరోధం, నేర పరిశోధన చేధింపు, త్వరితగతిన కేసుల దర్యాప్తు పూర్తిచేసి సకాలంలో కోర్టుకు సమర్పించడం, సమన్ల జారీ, వారెంట్ల ను అమలు చేయడం, కోర్టులలో పకడ్బందీగా సాక్ష్యాల నమోదు చేసి నేరస్తులకు శిక్షపడేలా పనిచేయడం తదితర అంశాల వారీగా 17 ఫంక్షనల్ వర్టికల్స్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల పోలీస్ స్టేషన్లలోని కానిస్టేబుల్ స్థాయి అధికారుల పనితీరు కూడా వీటిద్వారా మదింపు చేసి, ఉత్తమ సేవలందించే పోలీస్ అధికారులను ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందచేస్తున్నామని వివరించారు.

పోలీస్ స్టేషన్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి స్థాయిలో కూడా ఉత్తమ విధులు నిర్వహించే పోలీసులకు పురస్కారాలందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఫంక్షనల్ వర్టికల్స్ ప్రాతిపదికపైనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే పోలీస్ మెడల్స్ కు అధికారుల పేర్లను ప్రతిపాదించడం జరుగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా పోలీసుల పని సామర్ధ్యం పెరగడమే కాకుండా పౌరులకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. మొత్తం 17 అంశాల ప్రాతిపదికన కేటాయించిన ఫంక్షనల్ వర్టికల్స్ ప్రాతిపదికన ఈ పురాస్కారాలను అందచేశామని స్పష్టం చేశారు. కాగా, మెట్రో, నగర, పట్టణ, గ్రామీణ క్లస్టర్లుగా పోలీస్ స్టేషన్లను విభజించి ఉత్తమ సర్వీసులు అందించే పోలీస్ అధికారులను గుర్తించామని అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement