Sunday, November 10, 2024

Destroyed – బిప‌ర్ జోయ్ విల‌యంతో ఇద్ద‌రు మృతి… అంధ‌కారంలో వెయ్యికి పైగా గ్రామాలు..

న్యూఢిల్లి : గుజరాత్‌లో బిపర్‌జోయ్‌ తుపాను సృష్టించిన విధ్వంసంలో ఇద్దరు మరణించగా మరో 22 మంది గాయపడ్డారు. భారీ వర్షానికి పెను గాలులు తోడు కావడంతో 524 మహా వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. అనేక వాహనాలు, ఇండ్లు దెబ్బతిన్నా యి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో 1,000కి పైగా గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. భావ్‌నగర్‌ జిల్లాలో వర్షంలో చిక్కుకున్న మేకలను కాపాడే క్రమంలో ఒక మేకల కాపరి, ఆయన కుమారుడు మరణించారని చెప్పారు. 10 రోజులకు పైగా అరేబియా సముద్రాన్ని కవ్వంలా చిలికిన బిపర్‌ జోయ్‌ తుపాను.. గంటకు 125 కి.మీ.ల నుంచి 140 కి.మీ.ల వేగంతో గుజరాత్‌లోని జఖువా పోర్టుకు సమీపంలో తీరం దాటింది. క్రమక్రమంగా తీవ్రతను కోల్పోవడంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు గాలి వేగం గంటకు 100 కి.మీ.లకు చేరుకుంది. తుపాను ప్రభావానికి శనివారం రాజస్థాన్‌లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు.

పెనుగాలులకు, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడే అలల ధాటికి అంతంత మాత్రంగా కట్టిన ఇండ్లకు పెను నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, చెట్లు కూలిపోయే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పాటిల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేశారు. తుపాను తీరం దాటిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గిర్‌ అడవిలో సింహాలతో పాటుగా క్రూర మృగాల రక్షణ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి ప్రధాని వాకబు చేశారు.

94 వేల మంది సురక్షిత ప్రాంతాలకు
కోస్తా తీరం వెంబడి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 94,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. తుపాను ప్రభావం రైలు సర్వీసులపైన కూడా పడింది. గుజరాత్‌లో తుపా ను ప్రభావిత ప్రాంతాల గుండా రాకపోకలు సాగించే 99 రైళ్ళను రద్దు చేసినట్టు పశ్చిమ రైల్వే ప్రకటించింది. జామ్ నగర్‌ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలను శుక్రవారం వరకు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.

కోస్తా జిల్లాల్లో భారీగా విపత్తు స్పందన బలగాలు
జాతీయ విపత్తు స్పందన బలగానికి (ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌) చెందిన 18 బృందాలు, రాష్ట్ర విపత్తు స్పందన బలగానికి(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) చెందిన 12 బృందాలు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖకు చెందిన 115 బృందా లు, రాష్ట్ర విద్యుత్‌ శాఖకు చెందిన 397 బృందాలు కోస్తా జిల్లాల్లో మోహరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement