పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌కి చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2023 రేసులో నిలిచాడు. టాప్-10 ఫైనలిస్టుల్లో ఒకడిగా ఉన్నాడు. దాదాపు 130 దేశాల నుంచి ఈ అవార్డుకు నామినీలు వచ్చాయి. ఈ అవార్డు కింద బోధనారంగంలో అసాధారణ సేవలందించే అధ్యాపకులకు 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ అందిస్తారు.
దీప్ నారాయణ్ నాయక్ అనే బెంగాల్ టీచర్ అవలంబిస్తున్న వినూత్న బోధనా పద్ధతులు ఆయన్ను అంతర్జాతీయ పురస్కారానికి చేరువచేశాయి. ముఖ్యంగా కొవిడ్ సమయంలో పేద పిల్లలకు అతను విద్యాబోధన అందించిన తీరు ప్రశంసలు అందించింది. మిస్టర్ నాయక్ అసన్‌సోల్‌లోని జమురియాలోని తిల్కామాంరీ&ు అనే గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.
లాక్‌డౌన్ సమయంలో మారుమూల గ్రామాల్లోని పిల్లలకు వీధుల్లోనే తరగతులు నిర్వహించి పాఠాలు చెప్పాడు. మట్టిగోడలను బ్లాక్‌బోర్డులుగా మలిచి, రోడ్లనే తరగతి గదులుగా మార్చేశాడు. ఆయన బోధనా పద్ధతులు అక్షరాస్యతను పెంచడమే కాకుండా, మూఢనమ్మకాల నిర్మూలనకు, ఉపాధి అవకాశాల కల్పనకు దోహద పడ్డాయి. టీచర్ ఎట్ యువర్ డోర్‌స్టెప్ కార్యక్రమం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు సామాజిక బాధ్యతలపట్ల మార్గనిర్దేశం చేసింది.