గోవా రాజధాని పనాజీలో రాష్ట్ర టీఎంసీ నేతలతో మమతాబెనర్జి భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోవా కూడా తనకు మాతృభూమేనని తెలిపారు. నేను లౌకికవాదాన్ని విశ్వసిస్తా. నేను జాతి సమైక్యతను నమ్ముతా. భారత దేశం మన మాతృభూమి. అందుకే బెంగాల్ నాకు మాతృభూమి అయితే, గోవా కూడా నాకు మాతృభూమే అవుతుందని మమతాబెనర్జి అన్నారు. బెంగాల్ చాలా బలమైన రాష్ట్రమని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో గోవాను కూడా తాము బలమైన రాష్ట్రంగా చూడాలనుకుంటున్నామని చెప్పారు.
బెంగాల్‌కు చెందిన పలువురు మమతాబెనర్జి టీఎంసీ పార్టీ గోవాలో ఎలా పోటీచేస్తుందని అంటున్నారని, తాను భారతీయురాలిని కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీచేసే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. కాగా ఆమె గోవా అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. గోవాలో మకాం వేసి మరీ మంతనాలు జరుపుతున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మమతా గోవాకు చేరుకున్నారు.. ఆదివారం వరకు అక్కడే ఉండనున్నారు.