Saturday, November 23, 2024

ముగిసిన రెండో దశ పోలింగ్!

పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు నిర్వహించిన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు. పశ్చిమ బెంగాల్ లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79 శాతం ఓటింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 69 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్ లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. పలు చోట్ల బిజెపి, తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను అడ్డుకుంటున్నారని పరస్పరం ఆరోపించుకున్నాయి. ఓ పోలింగ్​ కేంద్రం నుంచి గవర్నర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కూడా ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు.. అసోంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

కాగా, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నియోజకవర్గం కూడా ఈ రెండో విడతలోనే పోలింగ్ జరిగింది. తృణముల్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి గా బిజెపి నుంచి సువేందు అధికారి పోటీ చేశారు. దీంతో అందరి దృష్టి నందిగ్రామ్ పైనే పడింది. నందిగ్రామ్ లో విజయం తమదంటే తమదేనని అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అసోంలో 39, బెంగాల్ లో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు గత నెల 27న తొలివిడత ఓటింగ్ జరిగింది. బెంగాల్ లో లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ గత నెల 27న జరగింది. తాజాగా జరిగిన పోలింగ్​లో అందరి దృష్టి నందిగ్రామ్​ నియోజకవర్గంపైనే ఉంది. సీఎం మమతా బెనర్జీ- బిజెపి నేత సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగడం ఇందుకు కారణం. నందిగ్రామ్​ నుంచి బరిలో దిగిన నాటి మిత్రులు-నేటి శత్రువులు మమతా బెనర్జీ-సువేందు అధికారి పోరులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement