మెల్ బోర్న్ – అనేక సంచనాలతో కొనసాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నిలో కొత్త ఛాంపియన్ అవతరించింది.. ఎవరు ఊహించనివిధంగా సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్, బెలారస్ కు చెందిన అరినా సబలెంక (బెలారస్) సంచలనం సృష్టించింది. ఫైనల్లో వింబుల్డన్ ఛాంపియన్, కజకిస్థాన్ క్రీడాకారిణి ఎలెనా రిబాకినా ను మూడు సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది. సబలెంకకు కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.
హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 6-4తో రిబాకినాను చిత్తు చేసింది. చివరి సెట్ గెలిచిన తర్వాత సబలెంక ఉద్వేగానికి లోనైంది. పట్టరాని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం సబలెంక ఉద్వేగానికి గురైన వీడియోను ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 24 ఏళ్ల సబలెంక ట్రోఫీతో పాటు రూ.17 కోట్ల ప్రైజ్‌మనీ అందుకుంది. ఈ విజయంతో సబలెంక డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.