హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సర్కార్ ఏ కార్యక్రమం తీసుకొన్నా అందులో ప్రజా సంక్షేమం, భవిష్యత్ అవసరాలు అనే లక్ష్యాలు ఇమిడి ఉంటాయనే అంశం మరోసారి రుజువవుతోంది. విలువైన భూముల పరిరక్షణ, ముందు తరాలకు అందజేతలో ప్రభుత్వం గుండె నిబ్బరంతో ముందుకు సాగుతోంది. రెండు వేల ఎకరాల స్వాధీనం దిశగా సర్కార్ కసరత్తు పూర్తి చేసింది. ఇక వెంటనే ఆయా భూములను సర్కార్ ఖజానాలోకి చేర్చాలని కార్యాచరణ చేస్తోంది. భూ కేటాయింపులు పూర్తయినప్పటికీ ఇంకా కార్యకలాపాలు మొదలు పెట్టని పరిశ్రమల వివరాలు, ఆయా భూముల వినియోగ స్థితిగతులపై ప్రభుత్వం కీలక విషయాలను సేకరిస్తున్నది.
65 పరిశ్రమలకు చెందిన 2 వేల ఎకరాలను తొలి దశలో వెనుకకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశ్రమలకు చెందిన భారీ ల్యాండ్ సైట్లను గుర్తించిన ప్రభుత్వం స్వాధీనం దిశగా కార్యాచరణ ప్రారంభించింది. రావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్ వేర్‌పార్క్, కరకట్టపల్లిలోని బయోటెక్ పార్క్, నానక్‌రామ్‌గూడలోని పారిశ్రామిక వాడల్లో భూముల కేటాయింపుల రద్దు దిశగా వేగంగా ప్రణాళిక సిద్దమవుతున్నది. ఆయా భూముల స్వాధీనానికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేగంగా కదులుతోంది. ఉమ్మడి ఏపీనుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 55 వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 28వేల ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి.
ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ఎకరాలు వృధాగా ఉన్నాయని తేల్చారు. భూములు తీసుకొని పరిశ్రమలను నెలకొల్పని పారిశ్రామిక వేత్తలు, కంపెనీల వివరాలను ప్రభుత్వం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో భూములు గరిష్ట ధర పలుకుతుండటంతో భూములను వదులుకునేందుకు ఆయా పరిశ్రమలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 1973నుంచి 2014 వరకు సుమారు 27 వేల ఎకరాలను అభివృద్ధిపర్చగా, రాష్ట్ర విభజన తర్వాత 28వేల ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులు అభివృద్ధిపర్చారు. 2014నుంచి ఇందులో 20909 పరిశ్రమలకు అనుమతులనిచ్చారు. రూ. 2.81లక్షల కోట్ల పెట్టుబడులు, 18.81 లక్షల మందికి ఉపాధి కల్పించారు.
ల్యాండ్ బ్యాంక్‌కు ఊతం…
నిర్దేశిత వినియోగానికి గురికాని భూములను వెనుకకు తీసుకుని భూ బ్యాంక్ బలోపేతం దిశగా కీలక చర్యలకు దిగాలని భావించింది. ఇందుకు సర్కార్ తీవ్రంగా కృషి చేస్తున్నది. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లి లక్ష్యం చేరాలని భావిస్తున్నది. గతంలో స్వాధీనానికి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని వారి వివరాలను తొలుత పరిశీలిస్తున్నది. కేటాయింపుల నిబంధనల్లో సరికొత్త మార్గదర్శకాలతో మార్పుల దిశగా కార్యాచరణ వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో సంపద పెంపు, సేవల రంగంతోపాటు పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వేగవంతమైన మార్పులు తెచ్చి ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. వీటి అభివృద్ధికి వేలాది ఎకరాలను కేటాయించింది.
రాయితీలు, ప్రోత్సాహకాలు…
వేలాది పరిశ్రమలకు రాయితీలనిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం భూములను నామమాత్రపు ధరకే కేటాయించి అంతర్జాతీయ కంపెనీలను కూడా ఆకర్శిస్తున్న సంగతి తెలిసిందే. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్శణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకున్నది. పెట్టుబడులను ఆకర్శించడం, ఉపాధి కల్పన లక్ష్యంగా సెజ్‌లను, పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కీలకమైన భూములను కేటాయిస్తున్నది. వసతుల కల్పనే కాకుండా భూమి ధర నిర్ణయం, ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలను సరళతరం చేసింది. ల్యాండ్ బ్యాంక్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం భవిష్యత్ పారిశ్రామిక, ఇరత అవసరాలకు సరిపడా భూముల గుర్తింపుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో నిరుపయోగ పరిశ్రామిక భూముల వివరాలను పరిశీలించింది.
కార్యకలాపాలు ప్రారంభించని భూములను వెనుకకు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. రావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్ వేర్‌పార్క్, కరకట్టపల్లిలోని బయోటెక్ పార్క్, నానక్‌రామ్‌గూడలోని పారిశ్రామిక వాడల్లో భూముల కేటాయింపుల రద్దు దిశగా వేగంగా ప్రణాళిక సిద్దమవుతున్నది. భూములు కేటాయించిన రెండేళ్లలోగా పరిశ్రమలు సదరు నిర్దేశిత లక్ష్యం చేరాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. అలా జరగని పరిశ్రమలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తున్నది. ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుల నిబంధనల్లో మార్పులు తెచ్చింది. భూములు పొందినవారికి నేరుగా సేల్‌డీడ్ ఇవ్వకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తోంది. దీనిపై పారిశ్రామిక వేత్తలు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం పలు మార్గాలను పరిశీలిస్తోంది.