Monday, November 25, 2024

సీబీఐకి బీర్భూమ్‌ కేసు, ఏప్రిల్‌ 7న నివేదిక ఇవ్వాలి.. దీదీ సర్కార్‌కు హైకోర్టు హుకుం

బీర్భూమ్‌ జిల్లాలో జరిగిన 8 మంది సజీవ దహనం కేసును సీబీఐకి అప్పగిస్తూ.. కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత బాదు షేక్‌ హత్యకు గురయ్యూడు. దీనికి ప్రతీకారంగానే 8మందిని సజీవ దహనం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వెనుక టీఎంసీ నేత హస్తం ఉన్నట్టు ఇప్పటికే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో దర్యాప్తు జరిపి.. నివేదికను ఏప్రిల్‌ 7కు అందజేయాల్సిందిగా తాజాగా కోల్‌కతా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది విచారణ చేస్తున్నది. రాష్ట్ర పోలీసు విభాగం గురువారం.. కేస్‌ డౖౖెరీని కోర్టులో సమర్పించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్‌ శ్రీవాస్తవ, న్యాయమూర్తి రాజర్షి భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం.. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. వెంటనే కేసును సీబీఐకి బదలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్కార్‌ అభ్యర్థన బుట్టదాఖలు..

సిట్‌ దర్యాప్తు సరైన దిశలో సాగుతుందని మమత నేతృతంలోని ప్రభుత్వం హామీ ఇవడంతో పాటు దర్యాప్తును సీబీఐకి బదలీ చేయవద్దని చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణకు ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకంగా దర్యాప్తు జరగాలంటే.. దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయని ధర్మాసనం అభిప్రాయపడింది. బీర్భూమ్‌ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సీఎం మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ పట్టుబడుతున్నది. గత సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ బాదు షేక్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే జోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఇళ్లకు నిప్పు పెట్టడంతో 8 మంది సజీవ దహనం అయ్యారు. సీబీఐని బీజేపీయే నడిపిస్తుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు అని, ఇలాంటి ఎన్నో కేసులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నోబెల్‌ ప్రైజ్‌ చోరీకి గురైనా.. ఇప్పటి వరకు రికవరీ చేయలేదని టీఎంసీ ఎంపీ శాంతానుసేన్‌ విమర్శించారు. సీబీఐను ఎవరు నడిపిస్తారో తమకు తెలుసు అని, కోర్టు ఆర్డర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయమని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement