హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఠారెత్తిస్తున్న ఎండలతో హడలెత్తిపోతున్న ప్రజలు బీర్ వినియోగాన్ని తీవ్రంగా పెంచేశారు. రాష్ట్రంలో మండుతున్న ఎండవేడిమితో మందుబాబులు బీర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అనూహ్యంగా రాష్ట్రంలో 40.46శాతం బీర్ల వృద్ధిరేటు నమోదైంది. అదే సమయంలో మద్యం వృద్ధిరేటు కేవలం 10శాతమే కావడం గమనార్హం. దీంతో గడచిన రెండు నెలలుగా మనోళ్లు ‘బీర్’బలులు అవుతున్నారు. పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. గడచిన రెండేళ్లలో కరోనా విజృంభన నేపథ్యంలో ఏటేటా వేసవిలో పెరిగే బీర్ల విక్రయాల్లో తొలిసారిగా తగ్గుదల నమోదైంది. 2020, 2021లలో శీతల పానీయాలను దూరంగా పెట్టిన ప్రజలు బీర్లను కూడా పెద్దగా వినియోగించలేదు. దీంతో గత రెండేళ్లు బీర్ల క్రయవిక్రయాల్లో తగ్గుదలతో కొన్ని కంపెనీల బీర్ ఉత్పత్తులు గడువు తేదీని ముగించుకుని వృధా అయ్యాయి. అయితే తాజాగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడిన నేపథ్యంలో బీర్ల విక్రయాలు పునరావృత్తమయ్యాయి.
మార్చి 1నుంచి రాష్ట్రంలో రూ. 4629కోట్ల మద్యం, బీర్లు విక్రయాలుకాగా, ఇందులో 7856805 పెట్టెల బీర్లు, 5046260పెట్టెల మద్యం ఉంది. గతేడాది ఇదే సమయంలో 3.89 కోట్ల లీటర్ల బీర్లే విక్రయమయ్యాయి. బీర్లు, మద్యం విలువ గతేడాది ఇదే సమయంలో కేవలం రూ. 3312కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి మొదటి నుంచి ఎండల తీవ్రత పెరగడంతో మంచినీళ్లప్రాయంగా బీర్‌ను సేవిస్తూ దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమిస్త్తున్నారు. తలసరి ఆదాయంలో వృద్ధిరేటుకు ధీటుగా తలసరి బీర్ వినియోగంలోనూ తమ హవాను కొనసాగిస్తున్నారు. గడచిన ఏడాదిలో పొరుగు రాష్ట్రాలకంటే తక్కువ బీర్ వినియోగంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు వారెవరికీ అందనంత స్పీడ్‌తో బీర్ వినియోగంలో దూసుకుపోతున్నారు. ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 5.45కోట్ల బల్క్ లీటర్ల బీర్‌ను సేవించిన ప్రజానీకం తలసరి బీర్ వినియోగంలో 6.99 శాతాన్ని నమోదు చేసుకొంది. ఇది ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే దాదాపుగా 5రెట్లు ఎక్కువ. పొరుగున ఉన్న ఏపీలో 2.79 శాతం తలసరి వినియోగం జరగ్గా, తమిళనాడులో 2.75 శాతం, కర్నాటక 3.27 శాతం, కేరళ 2.26 శాతంగా నమోదైంది. ఇక 3 కోట్ల 93 లక్షల జనాభా ఉన్న తెలంగాణలో 78లక్షల పెట్టెల బీర్ విక్రయాలు జరుగగా, జనాభాలో దాదాపు రెండింతలు ఉన్న తమిళనాడులో కూడా తెలంగాణ కంటే దాదాపు లక్ష పెట్టెల బీర్ విక్రయాలు తక్కువగా వినియోగమయ్యాయి. ఏ విధంగా చూసినా తెలంగాణ రాష్ట్రంలో బీర్ వినియోగం భారీగా పెరిగింది. మద్యం విషయానికి వస్తే రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం 5.08 శాతంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..