బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. అందుకే ఇంట్లో బిర్యానీని వండుకోలేని వాళ్లు వీకెండ్స్‌లో రెస్టారెంట్లకు వెళ్లి మరీ లాగించేస్తుంటారు. ఈ క్రమంలో బిర్యానీ తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుండగా నోటికి గాజు సీసా ముక్క గుచ్చుకుంది. దీంతో హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు కస్టమర్ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో తిరువళ్లకు చెందిన శైలేష్ ఊమెన్ 2017లో తన కుటుంబంతో కలిసి బిర్యానీ తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా శైలేష్ నోటికి ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. తీరా చూస్తే అది బీరు సీసా ముక్క. వెంటనే ఈ ఘటనపై హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా.. హోటల్ యజమాని ఇలాంటివి సర్వసాధారణమే అని వ్యాఖ్యానించాడు. దీంతో శైలేష్ హోటల్ తీరుపై కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన కోర్టు రూ.10వేలు పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.2వేలు మొత్తం రూ.12వేలు చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఈ వార్త కూడా చదవండి: వనపర్తి జిల్లాలో వింత జంతువు సంచారం