అమరావతి, ఆంధ్రప్రభ : వర్జీనియా బీచ్ తరహాలో విశాఖపట్టణంలో ‘బీచ్ ఐటి’ అనే ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సముద్రం వెంబడి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది.ఈ క్రమంలోనే మరింత ప్రత్యేకతగా ఐటీ మరియు ఐటీ ఎన్‌ఏబుల్డ్ సర్వీసెస్‌కు సంబంధించిన కంపెనీల కార్యాలయాలు సముద్రం ఒడ్డున బీచ్ వీక్షణతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమెరికాలోని వర్జీనియాలో ఇదే విధమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. అక్కడ ఐటీ కంపెనీలు అట్లాంటిక్ మహాసముద్రం వెంబడి ఆగ్నేయ వర్జీనియాలోని తీరప్రాంత నగరమైన వర్జీనియా బీచ్‌లో పలు ఐటీ, ఐటీ ఎన్‌ఏబుల్డ్ సర్వీస్ కంపెనీలను ఏర్పాటు చేశారు.
ఇటువంటి హైటెక్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పర్యావరణ వ్యవస్థ లేకపోవడంతో ఇప్పటివరకు అనేక దిగ్గజ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఏపీలోకి అడుగుపెట్టకపోయాయి. దీంతో బీచ్ ఐటి అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి సువిశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండటంతో ఇక్కడ ఆ ప్రాజెక్టును విస్తరించి మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 22 నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ముఖ్యమంత్రి జగన్ ఈ బీచ్ ఐటీ- కాన్సెప్ట్‌ను హైలైట్ చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..