ప్రభన్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి) : దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నగరంలోని బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ ప్రాంతంలో 10 హోల్‌సెల్ షాపులు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకు 300కు పైగా రిటేల్ షాపులకు అనుమతి ఇచ్చారు. రిటేల్ ఔట్‌లెట్ల కోసం రెండు డివిజన్ల పరిదిలో మరో 300కు పైగా అప్లికేషన్స్ ప్రాసెస్ దశలో ఉన్నాయి. సాధ్యాసాధ్యాలను బట్టి మరో రెండు రోజుల్లో మిగతా రిటేల్ ధరఖాస్తులను అనుమతించే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ తెలిపింది. టపాసులను ఇష్టా రాజ్యంగా రోడ్లపై విక్రయించకుండా నగరంలో 20కి పైగా ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేసింది. లంగర్ హౌజ్, బంజారాహిల్స్, చత్రినాక, యూసఫ్‌గూడ సవేరా ఫంక్షన్ హాల్, అలియాబాద్, మంగళ్ హట్, ఎన్టిఆర్ స్టేడియం తదితర ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల సముదాయాల్లో ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక యంత్రాలు, వాటర్ క్యాన్‌లను అందుబాటులో ఉంచేలా తగిన చర్యలు చేపట్టారు.
టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా కాల్చిన తర్వాత వేడి తగలకుండా దూరంగా ఉండాలి.
- పేలని టపాసుల వైపు తొంగి చూడటం మంచింది కాదు.
- కంటికి రక్షణగా ప్లెయిన్ గ్లాస్ దరించాలి. చిన్న పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పకుండా దగ్గర ఉండి, జాగ్రత్తగా చూసుకోవాలి.
- టపాసులు కాల్చే ప్రదేశానికి దగ్గరలో రెండు బకీట్ల నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.
- ఇంటి కారిడార్లో, ఇంటి లోపల, టెర్రస్ పైన కాకుండా ఆరు బయటే కాల్చాలి.
- భారీ శబ్దాల కోసం డబ్బాలు, అట్టపెట్టేలు, కుండలు, తేలికపాటి రేకు డబ్బాల్లో ఉంచి అస్సుల కాల్చకూడదు.
- ప్రమాదవశాత్తు చర్మం కాలినా, కంటికి గాయం అయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు అప్పటి పరిస్థితులను బట్టి ప్రమాదాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.