Thursday, October 31, 2024

పండుగలవేళ జాగ్రత్త, పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

దేశంలో మళ్లి కోవిడ్‌-19 కేసులు పెరుగుతూండటం పట్ల కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కొద్దిరోజులుగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, గడచిన వారం రోజుల్లో ఆయా రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోందని, వెంటనే కట్టడి చర్యలు ప్రారంభించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా విస్తృతిని సమర్ధంగా అడ్డుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని, ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను జారీ చేస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఆ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల..

ప్రస్తుతం ఢిల్లి, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వేగంగా విస్తరిస్తోందని కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో తక్షణం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం పెంచాలని, ప్రజలు మాస్క్‌ ధరించడం, శానిటైజేషన్‌ జాగ్రత్తలు తీసుకోవడం వంటి కరోనా మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ సూచించారు. పండుగుల సమయం వస్తున్నందున మరింత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో కరోనాసహా అంటువ్యాధుల వ్యాప్తి ఉధృతమయ్యే ముప్పుందని హెచ్చరించారు. ఏఏ జిల్లాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందో గుర్తించాలని, పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభావవంతమైన ప్రణాళికతో ముందుకువెళ్లాలని సూచించారు.

ఢిల్లిలో తీవ్రత ఎక్కువ..

దేశ రాజధాని ఢిల్లిలో కేసుల పెరుగుదల దేశంలోనే అత్యధికంగా ఉందని భూషణ్‌ పేర్కొన్నారు. సగటున రోజుకు 811 కేసుల చొప్పున నమోదవుతున్నాయని, శుక్రవారం ఒక్కరోజే 2202 కేసులు నమోదయ్యాయని చెప్పారు. గడచినవారం రోజుల్లో దేశంలో నమోదైన కేసుల్లో 8.5 శాతం మేర ఒక్క ఢిల్లిలోనే నమోదైనా యని, జులై 29న 802 కేసులు నమోదైతే ఆగస్టు 5న 1492 కేసులు నమోదైనాయని చెప్పారు. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 5.9 శాతం నుంచి 9.86కు పెరిగిందని చెప్పారు. గడచిన నెలరోజుల్లో కేరళలో రోజుకు సగటున 2347, మహారాష్ట్రలో 2135 చొప్పున కేసులు నమోదైనాయని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గడచిన 24 గంటల్లో ఢిల్లిdలో 2419 కొత్త కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఆరునెలల్లో ఇదే అధికం. పాజిటివిటీ రేటు 12.95 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా నాలుగో రోజు పది శాతం కన్నా ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉండటం గమనార్హం.

- Advertisement -

లక్షణాల్లో మార్పులు..

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో కరోనా లక్షణాల్లో వైరుధ్యం కన్పిస్తోందని, అందువల్ల జిల్లాలవారీగా నమోదవుతున్న కేసుల విషయంలో కొన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకోవాలని భూషణ్‌ సూచించారు. జిల్లాలవారీ ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌ (ఐఎల్‌ఐ), ఎస్‌ఏఆర్‌ఐ కేసుల సంఖ్యను గుర్తించాలని, దానిని బట్టి వ్యాధుల వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాలనుంచి వచ్చేవారినుంచి నమూనాలు తీసుకుని జినోమ్‌ సీక్వెన్సింగ్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు రద్దీగా తిరిగే ప్రదేశాల్లో కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూడాలన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

కొత్త కేసులు 19,406

కాగా గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,406 కేసులు నమోదుకాగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 571 కేసులు తగ్గాయి. మొత్తంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.31 శాతం కాగా జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. కొత్త కేసులతో కలపి ఇప్పటివరకు దేశంలో 4,41,26,994మందికి కరోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement