Saturday, November 23, 2024

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి.. ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో రెండో రోజు భారీ ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోనే 75 కోట్ల మంది జనాభాకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నొక్కి చెప్పారు అన్ని సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు, అలాగే అన్ని రాష్ట్రాలలో బీసీల మంత్రిత్వ శాఖలు ఉండగా కేంద్రంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెనుకబడిన వర్గాల వారితో బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణనలో కుల గణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏటా బీసీ కులాల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులు మారగాని భరత్, డాక్టర్ సత్యవతి, గురుమూర్తి, గోరంట్ల మాధవ్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్ర కుమార్, సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఎనగాల నూకాలమ్మ, తెలంగాణకు చెందిన జగదీశ్ యాదవ్ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ… బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి స్కాలర్ షిప్ పథకం, ఫీజుల రిఎంబర్స్ మెంట్ పథకం, ప్రత్యేక నవోదయ పాఠశాలలు, కులవృత్తులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి పథకాలు, ఇళ్ళ పథకాలు, స్వయం ఉపాది పథకాలకు బడ్జెట్ కేటాయింపులకు బీసీ జనాభా లెక్కలు లేకపోవడంతో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి వంటి కమిటీలు వేసినా ఏయే గ్రూపుకు ఎంత శాతం నిర్ణయించాలో తెలియక గందరగోళానికి లోనవుతున్నారన్నారు. 2018లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిపిన హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా గణనలో వెనుకబడిన తరగతుల లెక్కలు తీయాలని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. రెండవసారి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చిందని కృష్ణయ్య ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement