Friday, November 22, 2024

Delhi | బీసీలకు జనాభా నిష్పత్తిలో వాటా ఇవ్వాలి.. ఢిల్లీలో టీ-కాంగ్రెస్ ఓబీసీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో గత పదేళ్లుగా అధికారంలో లేనప్పటికీ పార్టీకి విధేయులుగా ఉంటూ అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పెట్టే కేసులను ఎదుర్కొంటూ కష్టనష్టాల్లోనూ పార్టీని నమ్ముకుని ఉన్న ఓబీసీ నేతలకు ఎమ్మెల్యే టికెట్లలో తగిన వాటా దక్కాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ నేతలు స్పష్టం చేశారు. అధిష్టానం పెద్దలను కలిసి తమ గోడు వినిపించేందుకు ఢిల్లీ వచ్చిన ఓబీసీ నేతల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రొ. కే. వెంకటస్వామి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూల సిద్ధాంతాన్ని నమ్ముకుని కష్టపడి పనిచేశామని, పార్టీ అందరిదీ అని భావిస్తూ వచ్చామని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడ్డవారిలో ఓబీసీలదే సింహభాగమని, తమతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలూ ఉన్నారని తెలిపారు. అలాగని అగ్రవర్ణాలు లేరని తాను చెప్పడంలేదని, కానీ క్షేత్రస్థాయిలో అన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నది బడుగు, బలహీన వర్గాలేనని తెలిపారు. తమ శ్రమతోనే కాంగ్రెస్ గ్రాఫ్ హిమాలయాల మాదిరిగా పెరిగిందని చెప్పారు. ఇన్నాళ్లుగా అంటీముట్టనట్టుగా ఉన్న తమ పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు పార్టీ గ్రాఫ్ పెరగగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్నారని వెంకటస్వామి అన్నారు. అలా వచ్చి చేరుతున్నవారిపై కూడా తమకు అభ్యంతరమేమీ లేదని, పార్టీకి విస్తరణ కూడా అవసరమేనని అన్నారు. కానీ జీవితాలను ఫణంగా పెట్టి, పార్టీ కోసం పోరాడిన బీసీలను పక్కనపెట్టే దుష్టపన్నాగాన్ని మాత్రం తాము ఒప్పుకోబోమని అన్నారు.

తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్ముకున్నామని, కిందిస్థాయిలో న్యాయం జరగకపోయినా.. అధిష్టానం న్యాయం చేస్తుందని భావిస్తున్నామని వెంకటస్వామి తెలిపారు. దరఖాస్తు చేసుకుని, అర్హత కల్గిన బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంత వడపోత జరిగినా సరే 55-57 మంది బీసీలకు టికెట్లు పొందే అర్హత ఉందని తెలిపారు. కాంగ్రెస్ పట్ల ప్రదర్శించిన నిబద్ధతను పరిగణలోకి తీసుకుని టికెట్లు ఇవ్వాలన్నారు. బీసీ నేతలెవరూ పార్టీని వదిలి వెళ్లలేదని, ఇతర వర్గాలు వదిలి వెళ్లి, తిరిగి వస్తున్నారని చెప్పారు. తమకు టికెట్లు ఇవ్వాలన్నది న్యాయమైన కోరిక అని, సహజన్యాయ సూత్రాల ప్రకారం తమ వాటా తమకు దక్కాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉందని, రాష్ట్ర నాయకత్వం విఫలమైతే జాతీయ నాయకత్వం న్యాయం చేయాలని వ్యాఖ్యానించారు.

- Advertisement -

నేతలందరం ఓబీసీ డెలిగేషన్ గా ఢిల్లీకి వచ్చామని తెలిపారు. న్యాయమైన వాటా తమకు ఇవ్వమని మాత్రమే కోరుతున్నామని, అన్యాయంగా ఎవరిదీ గుంజుకోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చేసిన తీర్మానం ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 2 సీట్ల చొప్పున.. మొత్తం 119 సీట్లలో 34 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పారని, కానీ అవైనా వస్తాయా రావా అన్న సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ ఓబీసీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన, అభద్రత నెలకొందని వివరించారు. తమ బాధను రాష్ట్ర నాయకత్వం వినకపోవడంతోనే ఢిల్లీకి వచ్చామని, అధిష్టానం పెద్దలను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరతామని చెప్పారు. ఢిల్లీకి వస్తున్న ఓబీసీ నేతల బృందంలో మహేశ్ కుమార్ గౌడ్, వీ. హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, సురేశ్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement