న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడంతో పాటు జనగణనలో కులగణన కూడా చేపట్టాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, కర్రి వేణుమాధవ్ తదితరులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రాలు అందజేశారు. బీసీల సమస్యలపై ఆయనతో మాట్లాడిన నేతలు, అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తమ డిమాండ్లను పరిశీలించిన హోంమంత్రి అమిత్ షా అవన్నీ న్యాయమైన డిమాండ్లుగా అంగీకరించారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో గతంలో ఎప్పుడూ లేనంతగా 27 మందికి చోటు కల్పించడం, బీసీలను పారిశ్రామికంగా ప్రోత్సహించడం కోసం రూపొందించిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారని చెప్పారు. వీటితో పాటు బీసీల వర్గీకరణ కోసం కమిషన్‌ను కూడా నియమించినట్టు అమిత్ షా గుర్తుచేశారు. త్వరలోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆర్. కృష్ణయ్య తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీల కోసం నిధులు పెంచుతామని చెప్పారన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జన గణనలో కులాలవారిగా లెక్కలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడాన్ని ఆర్. కృష్ణయ్య తప్పుబట్టారు. 34 అంశాలతో కూడిన జనాభా లెక్కల సేకరణ పత్రంలో అదనంగా ‘కులం’ అనే అంశాన్ని చేర్చి లెక్కలు సేకరించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో తెలియడం లేదని అన్నారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా దాదాపు 75 కోట్ల మంది ఉన్న బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం అగ్రరాజ్యంగా తయారవుతుందా అని ప్రశ్నించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కులగణన చేపట్టాలంటూ తీర్మానాలు చేశాయని, తెలంగాణ, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సైతం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయని గుర్తుచేశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం రైల్వే, ఎల్.ఐ.సి, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని అన్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండవని, తద్వారా ఆయావర్గాలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాల్లో తమ డిమాండ్ల గురించి వివరించారు.
డిమాండ్లు :
1) పార్లమెంట్ లో బి.సి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బి.సి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
2) పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.
3) బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలి.
4) జనాభా లెక్కలలో బి.సి కులాల వారిగా లెక్కలు సేకరించాలి.
5) బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
6) బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలి.
7) కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికు పెంచాలి.
8) ఎస్సీ/ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి చట్టాన్ని తీసుకరావాలి.
9) ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుపరచాలి.
10) సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి.
11) కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి.
12) కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.
13) కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
14) జాతీయ బి.సి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బి.సి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలి.
15) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేయడం లేదు. మెరిట్ లో వచ్చిన వారిని ఓపెన్ కంపిటీషన్ లో భర్తీ చేయాలి. కులాలు, వర్గాల ప్రమేయం లేకుండా రహస్య పద్ధతిలో ఇంటర్వ్యూలు జరపాలి.
16) పారిశ్రామిక విధానంలో బి.సి లకు 50 శాతం కోటా ఇవ్వాలి.