న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఢిల్లీలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జబ్బల శ్రీనివాస్, మోక్షిత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి అతి తక్కువ బడ్జెట్ కేటాయించిందని, దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రూ. 1400 కోట్లు కేటాయించి మిగిలిన 56 శాతం జనాభాను అవమానించారని వారు కేంద్ర మంత్రికి వివరించారు. సమావేశం అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ 38 లక్షల 45 వేల కోట్లు ఉంటే 56 శాతం జనాభా గల బీసీలకు జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించకుండా కేవలం రూ. 1400 కోట్లు కేటాయించడంలో ఏమైనా న్యాయం ఉందా? ఇలా అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ అభివృద్ధికి 40 సిఫార్సులు చేస్తే అందులో ఆర్థికాభివృద్ధికి సంబంధించినవి 16 సిఫార్సులు ఉన్నా ఇంతవరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్యా,స ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా, వాటికి అనుబంధంగా ఆర్థికపరమైన రాయితీలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజుల మంజూరు, హాస్టల్స్, గురుకుల, నవోదయ పాఠశాలల మంజూరుకు బడ్జెట్ కేటాయించడం లేదన్నారు. ప్రత్యేక హాస్టళ్ళు – విద్యా సంస్థలు లేకపోతే బి.సి లు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఐఐటీ,ఐఐఎం, నీట్ వంటి ముఖ్యమైన కోర్సుల ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఒక లక్షా 30 వేల నుంచి ఒక లక్షా 70 వేల వరకు ఫీజు కట్టాల్సి వస్తోందని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. క్రీమిలేయర్ పరిధిలో సీట్లు పొందే బీసీలు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు కడతారా? అని నిలదీశారు. క్రిమిలేయర్ పరిధిలో అతి పేదవారు రిజర్వేషన్ల ద్వారా సీట్లు పొందుతున్నా, ఫీజులు కట్టలేక చదువు మానేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పరిశ్రమలు రావడం, యాంత్రీకరణ చెందడం మూలంగా కులవృత్తులు – చేతివృత్తులు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కృష్ణయ్య కేంద్రాన్ని కోరారు. అలాగే రాజీవ్ ఫెలోషిప్ పథకం కింద అర్హులైన పీహెచ్‌డీ స్కాలర్స్ అందరికీ స్టైఫండ్ ఇవ్వాలని, గురుకుల పాఠశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..