Monday, November 25, 2024

Delhi | బీసీలు బిచ్చగాళ్లు కాదు.. జనాభా ప్రాతిపదికన వాటా దక్కాల్సిందే: ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో వెనుకబడిన వర్గాలు (బీసీలు) బిచ్చగాళ్లు కాదని, జనాభా దామాషా ప్రకారం వారికి చెందాల్సిన వాటా దక్కాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం తరఫున మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీల సంక్షేమానికి కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉన్న దేశంలో బీసీల అభివృద్ధికి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.

బీసీల రిజర్వేషన్లను పెంచడం లేదని, కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఉన్న బీసీ మంత్రులంతా పనికిరానివాళ్లేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాల్సిందేనని ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి చైతన్యపరుస్తామని, అన్ని పార్టీలనూ కలుస్తామని చెప్పారు. బీసీ బిల్లుతో పాటు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీసీలు బిచ్చగాళ్లు కాదని, జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా దక్కాలని ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. బీసీల చదువు, ఉపాధి కోసం ఏం చేయడం లేదని అన్నారు. బీసీల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బీసీల సంక్షేమం కోసం రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జులైలో లక్షలాది మందితో లాఠీలు చేబట్టి పార్లమెంట్ ముట్టడిస్తామని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.

- Advertisement -

పార్టీలకు అతీతంగా బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తామూ ఈ దేశ పౌరులమేనని, చైనా నుంచి రాలేదని అన్నారు. సంక్షేమ పథకాలను, జాతీయ బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పేదకులాల అభ్యున్నతిని రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. బీసీలకు సముచితస్థానం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, రాజకీయ పార్టీలు అజెండాను మార్చుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement