Saturday, November 23, 2024

Delhi | కేంద్ర బడ్జెట్‌లో బీసీలపై చిన్నచూపు.. ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు కేవలం 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య విమర్శించారు. వందలాది మంది బీసీ కార్యకర్తలతో బుధవారం పెద్దఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల బీసీ నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ ధర్నాకు మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కన్వీనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ రంగంలో బీసీల సంఖ్య 14 శాతానికి మించలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా స్పష్టమైందని చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక వర్గాలను విభజించి పాలిస్తున్నాయని ఆయన విమర్శించారు. 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా లేకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మంది మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. 129 బీసీ కులాలు ఉండగా 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేలలో కేవలం 38 మంది మాత్రమే వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారని కృష్ణయ్య చెప్పారు.

56 శాతం జనాభా గల బీసీలకు రాజకీయయ ప్రాతినిథ్యం ఎక్కడని ఆయన ప్రశ్నించారు. బీసీలకు ఉద్యోగాలు, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు మాత్రమే అమలు చేశారని ఆయన ఆరోపించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. 70 కోట్ల మంది జనాభా గల బీసీల అభివృద్ధికి ఇంతవరకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖలేదపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా బీసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement