టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలోనే కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అయితే వీళ్లంతా లండన్‌లో గత వారం జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లి వచ్చిన తర్వాతే కరోనా బారిన పడినట్లు తేలింది. ఈ ముగ్గురూ కొవిడ్ బారిన పడినా.. కెప్టెన్ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడానికి టీమ్ సభ్యులు.. బీసీసీఐ అనుమతి కోరలేదని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న బోర్డు.. విచారణ జరపనుంది.
అంతేకాదు కోహ్లి, రవిశాస్త్రి వివరణ కూడా కోరింది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ అధికారులకు చేరాయి. దీనిపై బోర్డు విచారణ జరుపుతుంది. ఇది బోర్డుకు తలవంపులు తీసుకొచ్చింది. నాలుగో టెస్ట్ ముగియగానే కోహ్లి, శాస్త్రిలను బోర్డు వివరణ కోరుతుంది. వీళ్లు ఈ ఈవెంట్‌కు వెళ్లడంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రె పాత్రను కూడా బోర్డు పరిశీలిస్తోంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఈవెంట్లకు వెళ్లొద్దంటూ బీసీసీఐ కార్యదర్శి జే షా ఒక్కో ప్లేయర్‌కు ప్రత్యేకంగా నోటీసులు పంపినా.. ప్లేయర్స్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది.