టీమిండియ కెప్టెన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీపై జట్టులోని సీనియర్ ప్లేయర్స్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారన్న వార్త నిజం కాదని తేలిపోయింది. అశ్విన్‌తోపాటు రహానే, పుజారాలాంటి సీనియర్లు ఇంగ్లండ్ టూర్‌లో ఉన్నప్పుడే ఫోన్ ద్వారా బీసీసీఐ కార్యదర్శి జే షాకు ఫిర్యాదు చేశారని, దీంతో బోర్డు కూడా రంగంలోకి దిగి ఇతర ప్లేయర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నదన్నది ఆ వార్తల సారాంశం. గత కొన్ని రోజులుగా కోహ్లి కెప్టెన్సీపై టీమ్‌లోని సీనియర్లు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్ నేరుగా బోర్డుకే ఫిర్యాదు చేసినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ వార్తను ప్రచురించింది. దీనిపై తాజాగా బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. టీమ్‌లోని సీనియర్ లేదా జూనియర్ ప్లేయర్ ఎవరూ రాత పూర్వకంగా లేదా మౌఖికంగా కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐకి ఫిర్యాదు చేయలేదని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
ఇలాంటి చెత్త వార్తలు రాయడం మీడియా మానుకోవాలి…ఆన్ రికార్డ్ చెబుతున్నాను.. ఏ ఇండియన్ క్రికెటర్ కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేయలేదని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి తప్పుడు వార్తకూ బీసీసీఐ సమాధానం ఇవ్వదు. ఇంతకుముందు కూడా వరల్డ్‌కప్ టీమ్‌లో మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అసలు ఎవరు చెప్పారు అని అరుణ్ ధుమాల్ మండిపడ్డారు. అయితే ఇలాంటి పుకార్లు ఇండియన్ క్రికెట్‌ను దెబ్బ తీస్తాయని ధుమాల్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను ఫాలో అవుతున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ విషయం తెలుసు. క్రికెట్‌కు ఇది చేస్తే బాగుంటుంది. అది చేస్తే బాగుంటుంది అని వాళ్లు సలహాలు ఇవ్వొచ్చు. అది వాళ్ల అభిప్రాయం, మేము దానిని గౌరవిస్తాం. మంచి రిపోర్ట్‌లను నేను కూడా చదవడానికి ఇష్టపడతాను. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు సరికాదు అని ధుమాల్ అన్నారు.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ లో హర్షల్ పటేల్ కొత్త రికార్డులు..