Friday, November 22, 2024

ప్రతి విదేశీ ఆటగాడిని సురక్షితంగా ఇంటికి చేరుస్తాం: బీసీసీఐ

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తుండడంతో అనేక దేశాలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు తాము స్వదేశాలకు వెళ్లడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ స్పందించింది. విదేశీ ఆటగాళ్లను వారి దేశాలకు పంపించే బాధ్యత తమదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్క విదేశీ ఆటగాడు ఇంటికి చేరినప్పుడే తాము ఐపీఎల్ టోర్నీ ముగిసినట్టు భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పటికే కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై ఐపీఎల్‌ను వీడి ఆస్ట్రేలియా వెళ్లిపోవడంతో మిగతా ఆటగాళ్లలోనూ కలకలం బయల్దేరింది. తమ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలంటూ ఆసీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లలో భరోసా నింపేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. విదేశీ క్రికెటర్లను వారి దేశాలకు భద్రంగా పంపించేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ చేస్తామని పేర్కొంది. టోర్నీ ముగిసిన తర్వాత ఎలా తమ దేశాలకు వెళ్లాలని ఆటగాళ్లు పడుతున్న ఆందోళన తమకు అర్థమైందని, దీని గురించి ఆటగాళ్లు బాధపడాల్సిన పనిలేదని బీసీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాండ్ అమీన్ వెల్లడించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆటగాళ్లకు లేఖ రాశారు. మైదానంలో అడుగుపెట్టడం ద్వారా ఆటగాళ్లు కోట్లమంది ప్రజల ముఖాలపై చిరునవ్వు తీసుకువస్తున్నారని, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల దృష్టి మరల్చేందుకు క్రికెటర్లు యథాశక్తి ప్రయత్నిస్తున్నారని అమీన్కొ నియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement