వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ఇవ్వాల (సోమవారం) ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. అయితే.. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్‌కు బీసీసీఐ మొండిచెయ్యి చూపింది. టీ20ల్లో వరుసగా విఫలం అవుతున్న రిషభ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గుచూపారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లో కూడా దాదాపుగా ఇదే జట్టు ఆడుతుంది. ఆసీస్ సిరీస్‌కు అర్షదీప్ సింగ్ దూరమవగా.. సఫారీలతో సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ దూరమయ్యారు. వీళ్లు ముగ్గురు ఈ సమయంలో కండిషనింగ్ కోసం ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటారని బీసీసీఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చాహర్