Tuesday, November 26, 2024

Delhi | బీసీ సీఎం ప్రకటన సువర్ణావకాశం.. తెలంగాణ ప్రజలు జారవిడుచుకోవద్దు : కె. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ బీసీ సీఎం ప్రకటన సువర్ణావకాశమని, దానిని జారవిడుచుకోవద్దని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తానన్న బీజేపీ గురించి ఆలోచించాలని లక్ష్మణ్ ప్రజలను కోరారు. సామాజిక దృక్పథం లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పరిపాలన అందించాయన్న ఆయన, బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమాన్షురావు ఇలా ఆ ఒక్క కుటుంబం నుంచే ముఖ్యమంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు.

బీజేపీలో అనేక మంది బీసీలు ఉన్నారని, సమర్థవంతమైన నాయకత్వం ఉందని చెప్పుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర బీజేపీకి, మోదీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ అభ్యర్థించారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై తెలంగాణలో మిగతా స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వ్యక్తిగత కారణాలా? రాజకీయ కారణాలా? అన్నది తేల్చాలని అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చాక తెలంగాణలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.

- Advertisement -

వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా చక్కటి మ్యానిఫెస్టో ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా వివేక్ వెంకటస్వామిపై ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉందని, ఆయనా ఖండిస్తూనే ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement