Saturday, November 23, 2024

ఈ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాల్సిందే.. జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నాలో ఎంపీ ఆర్. కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోని వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో అందిస్తున్న రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్న డిమాండ్‌తో పాటు చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన చేపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఈ మహా ధర్నా కార్యక్రమానికి పలువురు బీసీ నేతలు మద్ధతు పలికారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ కూడా ఈ మహా ధర్నాలో పాల్గొన్నారు. భారీ ప్రదర్శనలో భాగంగా స్టేజి మీద ప్రసంగించిన ఆర్. కృష్ణయ్య రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

బీసీ బిల్లు కోసం తాము వీధి పోరాటాలే కాదు, పార్లమెంటులోనూ పోరాడతామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లు కల్పించే విషయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని అన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని, బీసీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీల అభ్యున్నతి, అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ప్రధానిగా చేయలేదని, కానీ భారతీయ జనతా పార్టీ హయాంలోనే ఒక బీసీ నేత ప్రధాని అయ్యారని ప్రశంసించారు. అలాగే గిరిజన-ఆదివాసీ తెగలకు చెందిన మహిళను అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టారని కొనియాడారు. బీసీ నేత మోదీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థుడని, ఒక కర్మయోగి అని ఆర్. కృష్ణయ్య అన్నారు. అఖండ భారత్ సాధించాలన్న లక్ష్యం బీసీలతోనే సాధ్యమవుతుందని అన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement