న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తక్షణమే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు కదం తొక్కాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో వివిధ బీసీ సంఘాలు ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి, పార్లమెంట్ ముట్టడికి యత్నించాయి. పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నించిన బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్నా సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశంలో 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించకుండా కేంద్రం అణచివేస్తోందని మండిపడ్డారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 27 శాతం రిజర్వేషన్లే అమలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని అన్నారు. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో బిస్కట్లు కూడా రావని కృష్ణయ్య ఎద్దేవా చేశారు. బీసీల డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను దేశ వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.
మరో నేత దాసు సురేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో బీసీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోనూ 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, జి.అనంతయ్య, భుపేష్ సాగర్, వేముల రామకృష్ణ, బి.సి వెంకట్, జక్కుల వంశీ కృష్ణ, జక్కని సంజయ్, ఉదయ్, అరవింద్, లింగయ్య యాదవ్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..