Friday, November 22, 2024

Delhi | కాశీ క్షేత్రంలో బ్యాటరీ వాహనాలు.. భక్తుల సౌకర్యార్థం సరికొత్త ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాశీ క్షేత్రంలో విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం బ్యాటరీతో నడిచే వాహనాలను నగర యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తన ఎంపీ-లాడ్స్ నిధుల నుంచి వీటిని కొనుగోలు చేసి నగర యంత్రాంగానికి అందజేశారు. సోమవారం వారణాసిలోని విశ్వనాథ్ ఆలయం 4వ నెంబర్ గేట్ వద్ద ఎంపీ జీవీఎల్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వారణాసి నగర మేయర్ అశోక్ తివారీ, వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం, వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్‌తో పాటు శ్రీతారకరామ ఆంధ్ర ఆశ్రమం నిర్వాహకులు సుందర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే యాత్రికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు క్యూలైన్లలో నడవలేక ఇబ్బంది పడుతున్న విషయం ఎంపీ జీవీఎల్ దృష్టికొచ్చింది.

రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఇలాంటివారిని బ్యాటరీతో నడిచే గోల్ఫ్ కార్ట్‌లలో తీసుకెళ్తుంటారు. ఆ తరహా వాహనాలను ఆలయాల్లోనూ వినియోగంలోకి తీసుకొస్తే బావుంటుందన్న ఆలోచనతో జీవీఎల్ తొలిదశలో తన ఎంపీ-లాడ్స్ నిధుల నుంచి మూడు వాహనాలను కొనుగోలు చేసి దేవాలయానికి అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు కాశీ విశ్వనాథుడికి ఈ రకంగా సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కాశీ విశ్వనాధుని దర్శనం మరింత సులభతరం అయ్యేటందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement