Thursday, November 21, 2024

అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

అక్టోబర్ 6 నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా అంతకు నాలుగు రోజుల ముందు నుంచే సందడి ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలను అక్టోబరు 2 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం చేసింది. సిరిసిల్ల చేనేత కళాకారులు తయారుచేసిన ఈ చీరలు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాయి. పంపిణీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

అయితే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం వీటి పంపిణీపై సందేహాలు నెలకొన్నాయి. అక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో చీరల పంపిణీ ఎలా అన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ జిల్లాల్లో చీరల పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రూ.300 కోట్ల ఖర్చుతో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. ఈసారి మాత్రం ఇందుకోసం రూ.318 కోట్లు ఖర్చు చేసింది. 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో ఈ చీరలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆహార భద్రత కార్డులతో వచ్చే లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేస్తారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement