న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పూల పండుగ దేశ రాజధాని గడప తొక్కింది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వేడుకలను నిర్వహించాయి. మంగళవారం ఢిల్లీలోని ఇండియాగేట్ ఎదురుగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బతుకమ్మ వేడుకలను నిర్వహించగా, బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహించింది. పోటాపోటీగా జరిగిన వేడుకలకు ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగు ప్రజలతో పాటు ఉత్తరాదివాసులు సైతం ఎంతో ఆసక్తిగా హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ భవన్ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు మంద జగన్నాథం, కేఎస్ సహాని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు సహా పలువురు తెలుగు ప్రముఖులు, స్థానిక తెలుగు ప్రజలు, తెలంగాణ నుంచి ఢిల్లీకి రప్పించిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బతుకమ్మ పండుగ జరుపుకుందామంటే అనేక ఆంక్షలు పెట్టేవారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఘనంగా ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఘనమైనవని, కానీ 75 సంవత్సరాలుగా వాటిని తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామమని, ఢిల్లీలోని తెలుగు మహిళలకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలోని తెలుగువారందని ఏకంచేసేలా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందువల్లనే ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు జరుపుకోగల్గుతున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా అన్నదమ్ములమే అన్న స్ఫూర్తితో ఈ వేడుకలకు తెలుగువారందరూ హాజరవడం సంతోషంగా ఉందని ఆయనన్నారు.