- ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలు
- నూతనంగా మరో 14 ఏర్పాటు
- అన్నిరకాల వైద్య సేవలు ఉచితం
- అందరికీ అనుకూలంగా ఆరు.. జోన్లు..
- గ్రేటర్ పరిధిలో ఆరుగురు డీఎంహెచ్వోలు..
మహా నగరంలో బస్తీ దవాఖానాలతో పేదప్రజలకు సర్కార్ ఉచితంగా వైద్యసేవలనందిస్తోంది… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రస్తుతం 350 బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్యసేవలను ప్రజల దరికి చేర్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లాకు కొత్తగా మరో 14 దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉన్న మహా నగరంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు.. వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) పోస్టులను ఆరుకు పెంచింది.
– ప్రభ న్యూస్, హైదరాబాద్
మహా నగరంలోని పేదలకు ప్రభుత్వ వైద్యసేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యసేవలను అందిస్తుండగా, కొత్తగా మరో 14 దవాఖానాలు మంజూరైనట్లు తెలుస్తోంది. బస్తీ దవాఖానాల ఏర్పాటుతో అన్నిరకాల వైద్యపరీక్షలు, మందులు అందుబాటులో ఉండటం వలన ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో అన్నీ వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు సర్కార్ చెప్పుకోస్తోంది. దీనికి తోడు పట్టణ ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు యూపీహెచ్సీల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు, మహానగరంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రాథమిక వైద్యాన్ని మరింత బలోపేతం చేసే దిశలో..గ్రేటర్‌లోని డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టులను ఆరుకు పెంచింది.
కొత్తగా రానున్న డీఎంహెచ్‌వో జోన్లు..!
జీహెచ్ఎంసీ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల ఆధారంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టులను క్రియేట్ చేయనున్నారు. ఎందుకంటే ఆరోగ్యశాఖలో 33 జిల్లాల్లో డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని మరిన్ని వైద్య సేవలు అందేలా జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లకు అనుగుణంగా ఆరు మంది డీఎఅండ్హెచ్వోల చొప్పున రాష్ట్రంలో మొత్తం 38 మంది డీఎంఅండ్‌హెచ్‌వోలు పని చేయనున్నారు.అయితే ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో పరిధిలో 91 పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా..166 బస్తీ దవాఖానాలున్నాయి. రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో 19 పట్టణ ఆరోగ్య కేంద్రాలుండగా..మరో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలన్నీ హైదరాబాద్ పరిధిలోకి వెళ్లనున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్యారోగ్యాశాఖ అధికారి పరిధిలోని 36 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా..వీటిలో 12 తప్ప మిగిలివన్నీ కొత్త డీఎంఅండ్‌హెచ్‌వోల పరిధిలోకి రానున్నాయి. ఏ ఆరోగ్య కేంద్రం సంబంధిత డీఎంఅండ్‌హెచ్‌వో పరిధిలోకి వస్తుందన్న విషయం త్వరలోనే తెలుస్తోంది. ఇప్పటి వరకు శివారు జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారుల పరిధిలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు.. ఇకపై జోన్ పరిధిలోని డీఎంఅండ్‌హెచ్‌వోల పరిధిలోకి రానుండటంతో ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ పరిధి మరింత తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ..14 క్లస్టర్ల పరిధిలో..14 మంది సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు(ఎస్పీహెచ్వోలు) సేవలందిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎస్పీహెచ్‌వోల సీనియార్టీ ఆధారంగా కొత్త డీఎంఅండ్హెచ్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం.