పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాకలో డివిజన్ లో గల సుందర్ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి బీపీ చెక్ చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఎంతో ఖరీదైందని, మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలు ఆర్ధికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పేదలు అధికంగా నివసించే బస్తీల్లోనే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వివరించారు. జిహెచ్ఎంసి పరిధిలో 350 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు నూతనంగా 14 బస్తీ దవాఖానలు మంజూరైనట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల్లోనే అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉండటం వలన ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని, బస్తీ దవాఖానల పనితీరుకు ఇదే నిదర్శనమని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను కార్పోరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ కు పేదలే కాకుండా ఆర్ధికంగా స్థితిమంతులుగా ఉన్నవారు కూడా వైద్యం కోసం వచ్చారని, ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయని అనడానికి ఇంతకంటే ఇంకా ఏం రుజువు కావాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను సమకూర్చి వేలాది రూపాయల విలువైన టెస్ట్ లను కూడా ఉచితంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. నిమ్స్ హాస్పిటల్ ను 2వేల పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎల్ బీ నగర్ కొని కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలతో రానున్న రోజుల్లో హైదరాబాద్ మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందబోతుందని చెప్పారు. అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్ధిక ఇబ్బందులు పడవద్దని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్ లావణ్య, డాక్టర్ దీప్తి, తదితరులు పాల్గొన్నారు.