Saturday, November 23, 2024

తెలంగాణ భవన్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సామాజిక వివక్షను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మహాత్మ బసవేశ్వరుడి 889వ జయంతి వేడుకలను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వరుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. అభ్యదయవాది, వీరశైవ మత స్థాపకుడు బసవేశ్వరుడి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన మహనీయులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ స్మరిస్తూ, సత్కరిస్తూ అధికారికంగా కార్యక్రమాలను చేపడుతోందని గౌరవ్ ఉప్పల్ అన్నారు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో ఒకరని, కుల, మత బేధాలు లేని సమాజాన్ని స్థాపించడం కోసం అవిరళంగా కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త అంటూ కొనియాడారు. కులాలు, ఉపకులాలు లేవు మనుషులందరూ ఒకటేనన్న బసవేశ్వరుడి సందేశాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఉందని, అలా నడవడమే ఆయనకిచ్చే అసలైన నివాళి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో పాటు తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement