Wednesday, October 9, 2024

Basara:కాళ‌రాత్రి అవ‌తారంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం



బాస‌ర క్షేత్రంలో పుల‌కించిన భ‌క్త‌జ‌నం
కిక్కిరిసిన అక్ష‌రాభ్యాస మండ‌పాలు
సరస్వతీదేవీ నామ స్మరణతో మార్మోగిన పుణ్య‌క్షేత్రం
ఏడో రోజుకు చేరిన శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర:

బాస‌ర పుణ్య‌క్షేత్రంలో శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రం మూలన‌క్ష‌త్రం కావ‌డంతో అధిక సంఖ్య‌లో భ‌క్తులు ఇక్క‌డ‌కు చేరుకున్నారు. ఓం శ్రీ సరస్వతి నమః నామస్మరణతో ఆల‌యం మార్మోగింది. ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా సరస్వతి పూజను పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాల‌కు అధిక సంఖ్య‌లో పిల్ల‌ల‌ను తీసుకువ‌చ్చారు. ఇక్క‌డ‌ చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

కాళ‌రాత్రి అవ‌తారంలో స‌ర‌స్వ‌తి అమ్మ‌వారు

శార‌దీయ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు బుధవారం సరస్వతి అమ్మవారు కాళ‌రాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అష్టోత్తర నామార్చన పూజ నిర్వహించి అమ్మవారికి కిచిడిని నైవేద్యంగా సమర్పించారు. కాళ‌రాత్రి అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

అర్ధ‌రాత్రి రెండు గంట‌ల నుంచి…

అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ సన్నిధిలో అర్ధ‌రాత్రి రెండు గంట‌ల నుంచి అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. తొలుత మండ‌పంలో అమ్మ‌వారి ఉత్స‌వ విగ్ర‌హానికి ఆల‌య అర్చ‌కులు, వేద పండితులు మూల న‌క్ష‌త్ర పూజలు చేశారు. ఆలయ సన్నిధిలోని మూడు వెయ్యి రూపాయల టికెట్లు తీసుకున్న వారికి ప్రత్యేకంగా అక్షరాభ్యాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వంద రూపాయ‌లు, యాభై రూపాయ‌ల అక్ష‌రాభ్యాస మండ‌పంలో ఆల‌య అర్చ‌కులు, వేద పండితులు అక్ష‌రాభ్యాసం చేయించారు.

బారులు తీరిన భ‌క్తులు

మంగ‌ళ‌వారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత నుంచి భ‌క్తులు క్యూలైన్ల‌లో బారులు తీరారు. గోదావ‌రిలో పుణ్య‌స్నానాలు చేసి అనంత‌రం ఆల‌యంలో క్యూలైన్ల‌లోకి భ‌క్తులు చేరుకున్నారు. మండ‌పంలో అక్ష‌రాభ్యాసం చేయించిన అనంత‌రం శ్రీ‌జ్ఞాన స‌రస్వ‌తి, శ్రీ మ‌హాల‌క్ష్మి, శ్రీ‌మ‌హాకాళి అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. దీంతో ఆల‌య ఆవ‌ర‌ణం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement