త్వరలోనే దేశంలో విక్రయిస్తున్న డ్రగ్స్‌పై బార్‌కోడ్ ముద్రించనున్నారు. నకిలీ, నాణ్యతలేని డ్రగ్స్ తయారీ, సరఫరా, అమ్మకాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై జూన్‌లో ఫీడ్ బ్యాక్‌ను, సూచనలు కోరుతూ డ్రాఫ్ట్ గెజిట్‌ను విడుదల చేసింది.
మొత్తం 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్‌కోడ్ ముంద్రించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. బార్‌కోడ్‌లో మాన్యూఫ్యాక్చరింగ్ లైసెన్స్, బ్యాచ్ నెంబర్ , జనిటిక్ పేరు, డ్రగ్ పేరు, బ్రాండ్ పేరు, తయారు చేసిన కంపెనీ పేరు, చిరునామా, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వివరాలు కస్టమర్లు తెలుసుకోవచ్చు.
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ రూల్స్ 1945కి సవరణలు ఆమోదం పొందిన వెంటనే బార్‌కోడ్ నిబంధన అమల్లోకి రానుంది. వచ్చే సంవత్సరం మే నెల నుంచి బార్‌కోడ్ ముద్రించడం తప్పనిసరి కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలకు నకిలీ, నాణ్యతలేని, అనుమతిలేని మందులు మార్కెట్‌లోకి రాకుండా నిరోధించడానికి బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
ప్రత్యేకంగా షెడ్యూల్డ్ హెచ్2లో ఉన్న మొత్తం 300 డ్రగ్ ఫార్ములేషన్స్ ప్యాకేజీంగ్‌లో బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది. ఇలా బార్‌కోడ్ ముద్రించేవి మొత్తం మందుల్లో 35 శాతం వరకు ఉంటాయి.