Friday, November 22, 2024

కనీస బ్యాలెన్స్‌ బాదుడు.. 21 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంక్‌లు

బ్యాంక్‌లో ఖాతా ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం కనీస బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి బ్యాంక్‌లు భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, 5 ప్రధాన ప్రైవేట్‌ బ్యాంక్‌లు 2018 నుంచి ఇప్పటి వరకు 35,000 కోట్లు వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించనందుకు, పరిమితికి మించి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినందుకు, ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల పేరుతో బ్యాంక్‌లు కస్టమర్ల నుంచి వసూలు చేశాయి.

ఈ వివరాలను కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి భగవంత్‌ కరాడ్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం రంగంలోని 12 బ్యాంక్‌లతో పాటు ప్రైవేట్‌ రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌లు కలిసి బ్యాంక్‌ ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి 21,000 కోట్లు వసూలు చేశాయి. ఏటీఎంలో ఉతిచ విత్‌డ్రాలకు మించితే బ్యాంక్‌లు ప్రతి విత్‌డ్రాపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఇలా పరిమితికి మించి ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేసిన కస్టమర్ల నుంచి అన్ని బ్యాంక్‌లు కలిపి 8,000 కోట్లు వసూలు చేశాయి. ఇక ఎస్‌ఎంఎస్‌లు పంపించినందుకు అన్ని బ్యాంక్‌లు కలిపి కస్టమర్ల దగ్గర 6,000 కోట్లు వసూలు చేశాయి. ఇలా మొత్తం అన్ని రకాల బాదుడుతో బ్యాంక్‌లు కస్టమర్ల నుంచి 35,000 కోట్లు వసూలు చేశాయి. బ్యాంక్‌లో ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖాతాలో ఆయా బ్యాంక్‌లు నిర్ణయించిన కనీస బ్యాలెన్స్‌ ఉండాలి. ఇది ప్రతి నెల ఉంచాల్సి ఉంటుంది. లేకుంటే బ్యాంక్‌లు ఫైన్‌ వసూలు చేస్తున్నాయి.

- Advertisement -

ఈ ఫైన్లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో రెట్టింపు కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. ఒక కనీస మొత్తం ఖాతాలో ఎంత ఉండాలన్న దానిపై కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోల్చితే ప్రైవేట్‌ బ్యాంక్‌లు చాలా ఎక్కువ మొత్తాన్ని నిర్ణయించాయి. ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు, పరిమితికి మించి ఏటీఎం విత్‌డ్రాల విషయంలోనూ ప్రభుత్వం, ప్రైవేట్‌ బ్యాంక్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంటున్నది. ఈ ఛార్జీలు బ్యాంక్‌లకు, బ్యాంక్‌లకు మధ్య కూడా తేడాలు ఉంటాయి. దీంతో పాటు పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా తేడాలు ఉన్నాయి.

బ్యాంక్‌ ఖాతాలో నెలవారి సగటు బ్యాలెన్స్‌ బ్యాంక్‌లను బట్టి మెట్రో నగరాల్లో 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంచాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఈ బ్యాలెన్స్‌ 2,000 నుంచి 5,000 రూపాయల వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5,00 నుంచి ,1,000 రూపాయల వరకు ఉంచాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాదారుల నుంచి నెలకు 400-500 రూపాయల వరకు ఫైన్‌గా వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌లు మరో అడుగు ముందుకు వేసి ప్రతి నెల పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించే ఖాతాదారుల నుంచి ప్రతి లావాదేవీకి అదనంగా 100-125 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.

కనీసం బ్యాలెన్స్‌ లేని ఖాతాదారుల నుంచి కొంత మొత్తంలో జరిమానాగా వసూలు చేసుకునేందుకు బ్యాంక్‌లకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. బ్యాంక్‌లు వసూలు చేసే ఛార్జీలు సమేతుకంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లకు పంపించే వివిధ రకాల ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు కూడా సహేతుకంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసే విషయంలోనూ ఆర్బీఐ కొన్ని నిబంధనలు విధించిందని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి కరాడ్‌ వివరించారు. ఖాతా ఉన్న బ్యాంక్‌ ఏటీఎం నుంచి 5 స్లారు ఉచితంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం చేయవచ్చు.

మీరు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నా అది కూడా ఒక లావాదేవీగా పరిగణిస్తారు. ఇతర బ్యాంక్‌ల ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు 3 సార్లు అవకాశం ఇస్తారు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నిర్ధిష్టంగా కొంత మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తారు. ఇలా అదనంగా డబ్బులు డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి 21 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఇది 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇవన్నీ సేవింగ్‌ బ్యాంక్‌ అకౌంట్లకు వర్తించే ఛార్జీలు. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద ఓపెన్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్లకు ఇలా కనీస బ్యాలెన్స్‌ ఉండాల్సిన అవసరంలేదు. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రతి నెల ఈ ఖాతాదారులకు 4 సార్ల వరకు ఉచితంగా అనుమతి ఇస్తారు. ఈ పరిమితిదాటితే ఛార్జీలు వసూలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement