బ్యాంకులు.. కస్టమర్-ఫ్రెండ్లీగా ఉండటంపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఇలా చేయడంతో రుణం పొందే ప్రక్రియ రుణ గ్రహీతలకు మరింత ఇబ్బంది లేకుండా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. రుణాల కేటాయింపు విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో పాటు బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. స్టార్టప్ ఏర్పాటు కోసం కేటాయించే రుణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలని, సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని సూచించారు.
రిస్క్‌లు తీసుకోవద్దు..
పరిశ్రమ ప్రతినిధులతో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బ్యాంకులు ఒక ప్రతిపాదనపై ప్రతికూల రిస్క్‌లు తీసుకోవడం ద్వారా క్రెడిట్ అండర్ రైటింగ్ ప్రమాణాలపై సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బ్యాంకులు రుణాల విషయంలో జాగ్రత్తలు వహిస్తూనే.. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు బ్యాంకింగ్ కమ్యూనిటీకి కొన్ని సూచనలు చేశారు. వారి వైఖరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. బ్యాంకులు చాలా ఎక్కువ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. మీరు తీసుకోనవసరం లేని ప్రతికూల రిస్క్‌లను తీసుకునే స్థాయిలో కాకుండా.. మీరు కస్టమర్లతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలని నిర్మలమ్మ సూచించారు. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండమని చెప్పామని.. రిస్క్ తీసుకోమని తమ ఉద్దేశం కాదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈక్విటీ ఉంటే.. తగినంత రుణం..
ఈ విషయమై.. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా మాట్లాడుతూ.. స్టార్టప్ ఆందోళనలు.. ఈక్విటీ వైపు ఎక్కువగా ఉన్నాయన్నారు. తగినంత ఈక్విటీ టేబుల్‌పై ఉంటే.. రుణం ఇవ్వడంలో మద్దతు ఉంటుందని తెలిపారు. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం తీసుకొచ్చిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టు గురించి ప్రస్తావించారు.దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఖరా ఇచ్చిన సమాధానం చాలా చప్పగా ఉందని, తరువాత ప్రభుత్వ మద్దతు ఉన్న సీజీటీఎంఎస్ఈ పథకం గురించి మాట్లాడారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో బ్యాంకులు పూర్తిగా డిజిటల్‌గా రుణాలు మంజూరు చేస్తాయని ఖరా చెప్పారు. బ్యాంకుకు విశ్వసనీయమైన నగదు ప్రవాహ విజిబిలిటీ అందుబాటులో ఉంటే.. చిన్న వ్యాపారాల క్రెడిట్ వృద్ధి కాలక్రమేణా వ్యక్తిగత రుణాలను తాకొచ్చు అన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని, కస్టమర్లకు ఏదైనా ఇబ్బంది వస్తే.. వాటిని పరిష్కరించడానికి బ్యాంకు సిబ్బంది సహకరించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. బ్యాంకులు మరింత రుణాలు ఇవ్వడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడాల్సిన అవసరాలను గుర్తించాలన్నారు.
స్థిరమైన ఆర్థిక రికవరీ..
ప్రభుత్వం స్థిరమైన రికవరీని కోరుకుంటోందని, అందుకే మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు సహాయపడే విధంగా కేటాయింపు చేపట్టినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడుతున్న సమయానని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించామన్నారు. ముఖ్యంగా స్థిరమైన రికవరీ, వృద్ధి పునరుద్ధరణకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. సుస్థిరతకు, పన్నుల విధానంలో అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల మధ్య దేశీయంగా ప్రజలు చెల్లింపుల్లో ఇబ్బందులు పడకుండా టెక్నాలజీతో ఎంతో సహాయపడిందని, భవిష్యత్తులో విద్య, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పరిష్కారాలను అమలు చేయడంపై పరిశీలనలు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్‌లకు సహాయంగా మద్దతు కొనసాగిస్తుందన్నారు.
ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే..
పరిశ్రమ వర్గాలతో బడ్జెట్ అనంతర సమావేశం నిర్వహణ సందర్భంగా సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి జీడీపీలో 1.3 శాతం కేటాయిపులు చేశామన్నారు. ఇది గతంలో కంటే ఎక్కువే అయినప్పటికీ.. కనీసం 3 శాతానికి పైనే కేటాయింపులు ఉంటాయని అంచనా వేశామని తెలిపారు. దీనికి టీవీ సోమనాథన్ స్పందిస్తూ.. ఆరోగ్య సంరక్షణ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే అన్నారు. అయితే కొన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలను కేంద్రమే అందిస్తోందన్నారు. ఇక ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఆరోగ్య సేవలు అందేలా చూస్తున్నట్టు తెలిపారు. మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ అత్యవసర క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ పథకాన్ని అందిస్తోన్నట్టు గుర్తు చేశారు. దీని ద్వారా ఆరోగ్య రంగానికి రూ.50వేల కోట్ల ద్రవ్య సరఫరా చేసేందుకు వీలుందని, దీన్ని కార్పొరేట్ రంగంలో వినియోగించుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..