రేషన్ షాపుల్లో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 20 నుంచి ఈ సేవలు ఎంపిక చేసిన కొన్ని రేషన్ షాపుల్లో అందించబడుతాయని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,000 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో 800 మంది రేషన్ షాపు దుకాణదారులు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించాలనేది ప్రధాన ప్రతిపాదన అని పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ తెలిపారు. అయితే దీనిపై ఈ వారం చివరి సారిగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నాలుగు బ్యాంకులు ఈ తరహా సేవలు అందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు గాను.. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చిప్‌లను ఇన్స్టాల్ చేస్తామని స్పష్టం చేశారు.
బ్యాంకు అధికారులతో చర్చలు..
మే మొదటి వారంలో.. సంబంధిత బ్యాంకు అధికారులతో కూడా చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని వివరించారు. రేషన్ షాపుల ద్వారా.. అందించబడే.. ఇతర ప్రతిపాదనల్లో.. విద్యుత్ బిల్లుల చెల్లింపు సౌకర్యాలు, నీటి బిల్లుల చెల్లింపుల వంటి సౌకర్యాలు అందనున్నాయి. రేషన్ షాపులు మరింత ఫ్రెండ్లీగా మార్చేందుకు తమ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. మొబైల్ రేషన్ షాపు సౌకర్యాన్ని మరో 36 ట్రైబల్ హాంలెట్స్కు విస్తరింపజేస్తున్నట్టు ప్రకటించారు. పేదరికం కంటే దిగువన ఉన్నవారు రేషన్ కొనుగోలు చేసేందుకు రేషన్ ఔట్లెట్లకు చేరుకోలేకపోతున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు మొబైల్ రేషన్ దుకాణాలను ప్రారంభించామని తెలిపారు. ఏడాదిలోపు 1000 రేషన్ షాపులకు బ్యాంకింగ్ సేవలు విస్తరింపజేసేలా చర్యలు తీసుకుంటామని, మరిన్ని బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని వివరించారు. మొబైల్ రేషన్ షాపుల కోసం.. స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదిస్తున్నామని, వారు వాహన సౌకర్యం కల్పిస్తే.. సేవలు మరింత విస్తరింపజేస్తామని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..