అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియాతో పాటు పలు ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరుతో వరసగా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీనిపై చైనా కేంద్ర బ్యాంక్ స్పందించింది. ఇలా వడ్డీ రేట్లు పెంచడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం వల్లే పతనమైందని చైనా పీపుల్స్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ జువాన్ చాంగ్సెంగ్ అభిప్రాయపడ్డారు. బీజింగ్‌లో జరిగిన గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఫైనాన్స్ సంస్థలు తక్కువ వడ్డీరేట్లతో తమ బ్యాలెన్స్ షీట్లను నిర్వహించడానికి అలవాటుపడ్డాయని చెప్పారు.
వడ్డీరేట్లలో స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా వచ్చిన మార్పుతో ఇలాంటి సంస్థల బ్యాలెన్స్ షీట్లు ఇబ్బందులో పడుతున్నాయని చెప్పారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కూడా వడ్డీరేట్లలో వచ్చిన మార్పుల వల్లే పతనమైందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా తగ్గుతుందా లేదా అన్న విషయంలో ఎలాంటి స్పష్టతలేదన్నారు. ఈ పరిస్థితుల్లో వడ్డీరేట్లను పెం చుకుంటూ పోతే బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం ఇందుకు పెద్ద సూచికని ఆయన చెప్పారు. దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు.