హైదరాబాద్, ఆంధ్రప్రభ : వనస్థలిపురంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం కోర్టులో లొంగిపోయాడు. హయత్‌నగర్ కోర్టు ప్రవీణ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈనెల 30 వరకు ప్రవీణ్ రిమాండ్‌లో ఉండనున్నారు. బ్యాంక్ విధులలో ఉన్న సమయంలో కడుపునొప్పికి మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి వారం రోజుల క్రితం రూ.22.53 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవీణ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కోర్టు ప్రాంగణంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలున్నాయన్నారు. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని, బ్యాంక్‌లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకు నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారన్నారు. అతి త్వరలో బయటకువచ్చి బ్యాంకు మోసాలను బయట పెడతానని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణాలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి సాక్ష్యాలతో నిరూపిస్తాను. బ్యాంక్‌లో లాకర్స్‌కి పెట్టాల్సిన కెమెరాను కిందకు పెట్టారన్నారు. గతంలోనూ బ్యాంక్‌లో లక్ష రూపాయలు గల్లంతయ్యాయని, విషయం బయటకు రావద్దంటూ సిబ్బంది అందరూ కలిసి ఆ డబ్బులను కట్టామని, తర్వాత ఆ మొత్తాన్ని తానే చెల్లించానని చెప్పారు. బ్యాంక్‌లో జరగుతున్న అవకతవకలకు కారణం బ్రాంచ్ మేనేజర్ కారణమని పేర్కొన్నారు.
అసలు జరిగింది ఇది..
నగరంలోని వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయానని, మళ్లిd బెట్టింగ్‌లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంకు మేనేజర్‌కు ప్రవీణ్ మొదట మెసేజ్ చేశారు. అనంతరం మాట మార్చి బ్యాంకు నుంచి డబ్బులు తాను తీసుకువెళ్లలేదంటూ సెల్ఫీ వీడియోను బయటకు వదిలాడు. ఆ వీడియోలో బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..