విద్యుత్ వాహనాల రంగానికి బ్యాంక్ రుణాలు అందడంలేదు. సులువుగా రుణాలు లభించకపోవడంతో వాటి అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఈవీల కొనుగోలుకు బ్యాంక్‌లు రుణాలు ఆశించిన రీతిలో ఇవ్వకపోడం వల్ల అమ్మకాలు పెరగడంలేదని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈవీ ఇండస్ట్రీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు, సాంకేతిక పరిజ్జానం విషయంలోనూ అనేక సవాళ్లు ఎదరవుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలోనూ, బ్యాటరీల భద్రత విషయంలో ఎంతో మెరుగుపడాల్సి ఉంది. ఇప్పటికే పలు సంస్థలు ఈ స్కూటర్లు, మోటారు సైకిళ్లు, ఆటోలు, గూడ్స్ ఆటోలను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. కార్లు మాత్రం పేరున్న కంపెనీవే మార్కెట్లో లభిస్తున్నాయి.
ఈ రంగంలో వస్తున్న ఈవీ వాహనాల అమ్మకాలు పెరగాలంటే బ్యాంక్‌లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇచ్చినంత సులభంగా విద్యుత్ వాహనాలకు రుణాలు ఇవ్వడంలేదు. దేశంలో ఇప్పటికీ ఈవీ రంగం స్థిరీకరణ సాధించలేదు. బ్యాటరీ వారంటీ, వాహనాల ఎంత కాలం మన్నుతాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల జీవితకాలం ఉంది. చాలా వాహనాలు అంతకంటే ఎక్కవ కాలమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈవీలకు మాత్రం ఇలా ప్రమాణికమైన జీవిత కాలం నిర్ణయించలేదు. నాణ్యతా ప్రమాణాల విషయంలోనూ స్పష్టత లేదు. ఈ కారణాల వల్లే పెద్ద సంస్థలు ఇంకా ఈ రంగంలోకి భారీ ఎత్తున ప్రవేశించలేదు. ఈ కంపెనీలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి.
బ్యాంక్‌ల నుంచి ఆశించిన స్థాయిలో రుణాల విషయంలో స్పందన లేకపోవడంతో చిన్న, మధ్య తరహా ఆర్ధిక సంస్థలు ఈ రంగానికి రుణాలు ఇచ్చేందుకు దృష్టి సారిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, పేమి ఇండాయి, ప్రెస్ట్లోన్స్, గ్రిప్ ఇన్వెస్ట్, రెవ్ఫిన్, ఆకాస ఫైనాన్స్ వంటి సంస్థలు ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నాయి. ఈ సంస్థలు ఈవీ కొనుగోలుకు రుణాలు ఇస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రుణ సంస్థలు ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫైనాన్షియల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఈఎంఎఫ్ఏఐ)గా ఏర్పడ్డాయి. విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరిగేందుకు తమ వంతు సహకారం అందిస్తామని, పెద్ద ఎత్తున రుణాలు ఇస్తామని ఈ సంస్థ తెలిపింది. ఈ సంస్థ ప్రకారం ప్రస్తుతం 13 సంస్థలు విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం రుణాలు ఇస్తున్నాయి.
ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు లక్షకు పైగా ఈవీల కొనుగోలుకు వెయ్యి కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు తెలిపింది. మనదేశంలో 2030 నాటికి ప్రయివేట్ కార్లలో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతతం విద్యుత్ విహనాలు ఉంటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
3 నిముషాల్లో ఛార్జింగ్
అమెరికాలోని హార్వర్డ్ లోని యాడెన్ ఎనర్జీ అనేక అంకుర సంస్థ సరికొత్త కారు బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ కేవలం మూడు నిముషాల్లోనే పూర్తిగా ఛార్ ్జ చేయవచ్చని ఆ సంస్థ తెలిపింది. తాము రూపొందించిన బ్యాటరీ 20 సంవతత్సరాల పాటు పని చేస్తుందని కూడా తెలిపింది. ఇది మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఈవీ వాహనాల విక్రయాలను మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.