Friday, November 22, 2024

డ్రైనేజీ పైపుల ద్వారా ఇండియాలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు

దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు బెంగాల్‌లోని హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం, విజయవాడలో ఆర్‌పీఎఫ్ సిబ్బంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. నలుగురు బంగ్లాదేశీయులను విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులు విచారిస్తున్నారు. హావ్‌డా- వాస్కోడిగామా రైళ్లో వస్తున్న వీరి వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా డ్రైనేజీ పైపుల ద్వారా భారత్‌లోకి వచ్చినట్లు విచారణలో తేలింది.
బెంగళూరు చిరునామాతో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఉన్నట్లు గుర్తించారు. 2017 నుంచి 2019 వరకు వీరు గోవాలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కొవిడ్‌ కారణంగా 2019 తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు గుర్తించారు.

ఈ ఏడాది జూన్‌లో మళ్లీ గోవా వచ్చినట్లు విచారణలో వారు వెల్లడించినట్లు సమాచారం.విజయవాడలో నలుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశాం. సెల్‌ఫోన్లు, నకిలీ కార్డులు స్వాధీనం చేసుకున్నాం. ప్రాథమికంగా విచారణ చేశాం.. మరింత విచారించాల్సి ఉందని విజయవాడ నార్త్ జోన్‌ ఏసీపీ షానూ షేక్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement