ఆసియాకప్ 2023లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) బంగ్లాదేశ్-ఇఫ్ఘనిస్తాన్ పోటీ పడగా.. ఈ మ్యాచ్ లో బంగ్లా జ్టటు బోణీ చేసింది. సూపర్-4 చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి అఫ్గాన్‌పై 89 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మెహ్‌దీ హసన్ మిరాజ్(112), నజ్ముల్ హొస్సెన్ షాంటో(104) పరుగులతో చరో సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరికి తోడుగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్ (75), హష్మతుల్లా షాహిది (51) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇక హసన్ మహముద్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెహ్‌దీ హసన్ మీరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
బంగ్లాదేశ్ విజయంతో గ్రూప్-బీ సూపర్ 4 క్వాలిఫికేషన్ సంక్లిష్టంగా మారింది. శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య జరిగే తదుపరి మ్యాచ్‌పై బంగ్లాదేశ్ సూపర్ 4 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధిస్తే అఫ్గానిస్థాన్ ఇంటిదారి పడుతుంది. ఒకవేళ అఫ్గాన్ విజయం సాధిస్తే మూడు జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు టోర్నీలో ముందంజ వేస్తాయి. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ -4 చేరగా.. రేపు (సోమవారం) భారత్-జపాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా రెండో జట్టు ఏదో తేలనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టీమిండియా ఇంటిదారిపడుతోంది.