ఆర్మీ హెలికాప్టర్ లో ఇండియాకు రాక
గత 15 రోజులుగా రిజర్వేషన్ల పై ఆందోళనలు
ఘర్షణలు,కాల్పులలో 300మందికి పైగా మృతి
ఇకపై ఆందోళకారులపై కాల్పులు జరపబోమన్న సైన్యం
ఆర్మి వ్యతిరేకతతో ప్రధాని పదవికి రాజీనామా
పరిపాలన పగ్గాలను చేతిలోకి తీసుకున్న సైన్యం
ఆంధ్రప్రభ స్మార్ట్ – డాకా – బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రభుత్వాన్ని ఆర్మీ హెచ్చరించడంతో విధిలేని పరిస్థితిలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి ఇండియాకు పయనమయ్యారు..
ఇది ఇలా ఉంటే ప్రభుత్వం ఉద్యోగాలలో రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో 300 మందికి పైగా మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.. షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి నిరసనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు నిరసనకారులకు మద్దతు పలికారు. తాజాగా ఆందోళనకారులకు, పాలక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో ఆదివారం ఒక్క రోజే వంద మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులపై ఇకపై కాల్పులు జరపబోమని సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు చర్చల కోసం ప్రధాని హసీనా చేసిన ప్రతిపాదనను విద్యార్థి నాయకులు తిరస్కరించారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (సీఏఎస్) ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో సమావేశమైన దరిమిలా ఇకపై నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చబోమని ప్రకటించారు. అలాగే అధికార మార్పిడి అప్రజాస్వామికంగా జరిగితే బంగ్లాదేశ్ కూడా కెన్యాలా మారుతుందని వ్యాఖ్యానించారు. 1971 తర్వాత దేశంలో ఇదే అత్యంత హింసాత్మక నిరసన అని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ నజ్ముల్ అహ్సాన్ కలీముల్లా పిలుపునిచ్చారు. ఈ వ్యతిరేకతల మథ్య షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.. దీనిపై ఆర్మి చీఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాము ప్రజాస్వామ్య ప్రభుత్వానే ఆశిస్తున్నామని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో పాలన పగ్గాలను తాము చేతిలోకి తీసుకున్నామని తెలిపారు.. త్వరలోనే ప్రజా పాలన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరితో కలిసి భారత్ లో ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం.