వరుసగా రెండు ఓటములు, ముగ్గురికి గాయాలు బంగ్లాదేశ్‌లో చివరి వన్డే శనివారం జరగనుంది. బంగ్లాదేశ్‌తో చివరి వన్డేకి ముందు భారత జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. సిరీస్‌లో నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ టెస్టులకు ముందు ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలంటే భారత్ గెలిచి తీరాల్సిందే. విజయం చేరువగా వచ్చి బోల్తా పడిన జట్టును మూడో వన్డేలో గెలిపించే ఆటగాడు ఎవరు? బంగ్లా చేతిలో క్లీన్ స్వీప్ కాకుండా పరువు కాపాడుకుని స్టార్ క్రికెటర్‌గా మారేదెవరో వేచి చూడాల్సిందే.
బంగ్లాదేశ్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన టీమిండియా మూడో వన్డేలో విజయంపై కన్నేసింది. అయితే బొటనవేలు గాయంతో కెప్టెన్ రోహిత్ శర్మ చివరివన్డేతో పాటు టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. మూడో వన్డేకు 14మంది బృందంతో కూడిన జట్టుని బీసీసీఐ ఎంపిక చేసింది. గాయంతో బాధపడుతున్న పేసర్ దీపక్ చాహర్, కుల్దిప్ సేన్‌లకు కూడా విశ్రాంతిని ఇచ్చింది. మూడో వన్డేతో పాటు టెస్ట్ సిరీస్‌కు కుల్దిప్ యాదవ్‌ను సెలెక్ట్ చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైనా కూడా ఈ స్పిన్నర్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
భారత జట్టు ఇదే
కెఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రాహుల్ త్రిపాఠీ, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, కుల్దిప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్
చివరి వన్డే గెలుపుకు తహతహ
బంగ్లాతో వన్డేసిరీస్ జారవిడుచుకుంది టీమిండియా. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి తీరాలని అభిమానులు ఉవ్వీళూరుతున్నారు. అయితే కీలక ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తే ఇది సాధ్యపడుతుంది. రోహిత్ శర్మ గాయం బారిన పడటంతో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ గెలుపు బాద్యత తీసుకోవాలి. కెప్టెన్‌గా వ్యవహరించే కెఎల్ రాహుల్ జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయాస్ అయ్యర్ తన ఫామ్‌ను కొనసాగించాల్సిన అవసరముందని అభిమానులు కోరుకుంటున్నారు. చివరి వన్డేలో బ్యాటర్లు మరింత బాధ్యతతో గెలిపించాలి. అలాగే భారత బౌలర్లు ఇటు బ్యాటింగ్‌లోనూ కాస్త తమ సహకారం అందించాలి.