బెంగుళూరు – వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి . మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, మోడీని గద్దె దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పాట్నా, బెంగళూరులలో విపక్షాలు సమావేశమై కార్యాచరణపై చర్చించాయి. మోడీకి ధీటైన నేతను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. .
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి ఇప్పటి వరకు యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియెన్స్)గా ఉండేది. తాజాగా ఈ కూటమికి INDIA (indian national democratic inclusive alliance) అనే పేరును పెట్టారు. బెంగుళూరులో నేడు సమావేశమైన వివిధ పార్టీలకు చెందిన నేతలంతా ఆమోదముద్ర వేసినట్లుగా సమాచారం. ఈ విపక్ష కూటమిని ఇకపై ‘‘INDIA’’గా పిలవనున్నారు.
పరిస్ధితులను బట్టి మరిన్ని పార్టీలు , బీజేపీకి దూరంగా వుండే పార్టీలు ఈ కూటమిలో కలిసే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ప్రస్తుతం యూపీఏ ఛైర్‌పర్సన్‌గా వున్న సోనియా గాంధీయే ఈ కూటమికి చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. నేటి సాయంత్రం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కాగా నేటి బెంగుళూరు సమావేశానికి శరద్ పవర్ హాజరయ్యారు..