Saturday, November 23, 2024

ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా?

దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలుపుతుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేకుండా పోయారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ వేస్తామని ప్రధాని ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని చెప్పారు.

స్వదేశీ వ్యాక్సిన్‌ తయారు చేసుకోకలేకపోతే లక్షల కోట్లు నష్టపోయే వాళ్లమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌లో భారత్‌ మూడోస్థానంలో ఉందదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని బండి మండిపడ్డారు. కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటే కేసీఆర్ కు బాధగా ఉందని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు 80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించిందని, జూలై నాటికి మరో 40 లక్షల డోసుల వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  కరోనా కోసం రూ. 2,500 కోట్లు కేటాయించానన్న కేసీఆర్​… ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. రూ.500 కోట్లను కేటాయిస్తే శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైద్యులు, సిబ్బంది నియామాకానికి చర్యలు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement